Jun 01,2023 20:49

ప్రజాశక్తి - భీమవరం
దేశానికి అత్యున్నత పథకాలు తీసుకొస్తున్న భారత క్రీడాకారుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి దుర్మార్గంగా ఉందని సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్‌, ఎఐటియుసి జిల్లా నాయకులు చెల్లబోయిన రంగారావు విమర్శించారు. రెజ్లర్ల పట్ల బిజెపి ఎంపీ వేధింపులను నిరసనగా భీమవరం ప్రకాశం చౌక్‌ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీ నడిబొడ్డులో గత కొంతకాలంగా బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలని, క్రీడాకారులపై లైంగిక వేధింపులను అరికట్టాలని ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు అనేకమంది క్రీడాకారులు, కళాకారులు, మేధావులు, అభ్యుదయవాదులు, రాజకీయ పార్టీలు క్రీడాకారుల ఆందోళనకు మద్దతుగా ఉంటే తట్టుకోలేని కేంద్ర ప్రభుత్వం ఆందోళనకారులపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి లైంగిక వేధింపులకు పాల్పడ్డ బిజెపి ఎంపీని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి బి.వాసుదేవరావు, ఎం.ఆంజనేయులు, ఎం.వైకుంఠరావు, కె.సత్యనారాయణ, ఎం.మునీయ, వైవి.ఆనంద్‌, ఆకలి రాము, డి.సత్యనారాయణ పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం:బిజెపి మంత్రి బ్రిజ్‌ భూషణ్‌ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసి, ఆయనపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు అన్నారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద న్యాయం చేయాలని కోరుతున్న ఒలింపిక్‌ మహిళా రెజ్లర్లకు సంఘీభావం తెలుపమని సంయుక్త కిసాన్‌ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం తాడేపల్లిగూడెం సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్‌ ఐల్యాండ్‌ వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు జవ్వాది శ్రీను హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి మంత్రి బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తే రానున్న రోజుల్లో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి జవ్వాది శ్రీను, నరమాల కృష్ణ, అగుర్తుల రామోహనరావు, కన్నంరెడ్డి శివాజీ, యడవల్లి వెంకన్న, పతివాడ నాగేంద్రబాబు, గొర్రెల వంశీ, శ్రీను పాల్గొన్నారు.
తణుకురూరల్‌ : రెజ్లర్లను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ను వెంటనే అరెస్టు చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, సిపిఎం పట్టణ కార్యదర్శి పివి.ప్రతాప్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక నరేంద్ర సెంటర్లో కార్మిక సంఘాలు, వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని నిరసన, ధర్నా నిర్వహించి అనంతరం ఎంపీ చిత్రపటాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాగరాజు, ప్రతాప్‌ మాట్లాడుతూ దేశ ప్రతిష్టను క్రీడల ద్వారా ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన వారి పట్ల బిజెపి ఎంపీ వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. మాజీ ప్రిన్సిపల్‌ సంకు మనోరమ, ఐఎన్‌టియుసి నాయకులు దిర్శిపో రామకృష్ణ, సిఐటియు నాయకులు పి.దక్షిణామూర్తి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పి.అమ్మిరాజు, బండి సత్యనారాయణ, శ్రీను, బి.కృష్ణకిషోర్‌, కామన మునిస్వామి, గార రంగారావు, ఎం.రమేష్‌, డి.మూర్తి, ఆదిలక్ష్మి, వి.కృష్ణవేణి, కడలి వీర్రాజు పాల్గొన్నారు.
ఉండి : ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ను పదవి నుంచి తొలగించి వెంటనే అరెస్టు చేయాలని సిఐటియు మండల కార్యదర్శి కొట్టాడ వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా నాయకులు ధనికొండ శ్రీనివాస్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉండి మెయిన్‌ సెంటర్లో గురువారం రెజ్లర్లకు మద్దతుగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కొట్టాడ వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా నాయకులు ధనికొండ శ్రీనివాస్‌ మాట్లాడారు. 40 రోజులుగా రెజ్లర్లు ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా రెజ్లర్లు చేస్తున్న నిరసనకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి బ్రిజ్‌ భూషణ్‌ను పదవి నుంచి వెంటనే తొలగించాలని లేనిపక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మజ్జి నాగేశ్వరరావు, కడలి నాగేశ్వరరావు, కట్టా రవి, జుత్తిగ లకుడు పాల్గొన్నారు.