
* రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో మెలగాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో కొన్న చిన్నారావు మెమోరియల్ జిల్లాస్థాయి తైక్వాండో పోటీలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడల్లో రాణించేందుకు మరింతగా సాధన చేసి రాష్ట్ర కీర్తిని, దేశ ప్రతిష్టను పెంపొందింపజేయాలని ఆకాంక్షించారు. అనేక మంది ఔత్సాహికులు, సంబంధిత సంస్థలు క్రీడలపై ఆసక్తి చూపడం వల్ల ఇలాంటి వాటిని నిర్వహించగలుగుతున్నామన్నారు. కొన్న చిన్నారావు పేరిట కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా ముందుకు వస్తేనే క్రీడల అభివృద్ధి సాధ్యమన్నారు. మంచి సమాజం నిర్మాణం చేయడమంటే క్రీడా స్ఫూర్తిని అందరిలో నింపడమేనని చెప్పారు. ఆటలో గెలుపోటములు సహజమని, ఆ రెండింటినీ సమానంగా స్వీకరించాలని సూచించారు. ఓటమి అనుభవం తదుపరి విజయానికి నాంది అని అన్నారు. తైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తైక్వాండో శ్రీను మాట్లాడుతూ జిల్లాస్థాయిలో సబ్ జూనియర్స్, క్యాడెట్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఎం.వి పద్మావతి, పూడి తిరుపతిరావు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ పి.సురేఖ, జర్నలిస్టు సంఘాల నాయకులు కె.వేణుగోపాల్, ఎస్.జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.