కరెంటు ఛార్జీల పెంపుపై దశలవారీ పోరాటం
ప్రజాశక్తి-కావలి రూరల్ : కరెంటు ఛార్జీల పెంపును నిరసిస్తూ దశలవారీ పోరాటాలు నిర్వహిస్తున్నట్లు వామపక్షాల నాయకులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో పెంచిన కరెంటు ఛార్జీలపై వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు పసుపులేటి పెంచలయ్య, పసుపులేటి తిరుపాలు, సిపిఐ నాయకులు కొప్పర్తి నాగరాజు, బలిజేపల్లి వెంకటేశ్వర్లు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కరవది భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ సుమారు 7సార్లు కరెంటు ఛార్జీలను పెంచిందని రూ.100 కట్టే కరెంటు బిల్లు రూ.300 చేరిందన్నారు. ఈ ప్రకారం ప్రజలపై వేల రూపాయలు కరెంటు ఛార్జీల భారం మోపిందని విమర్శించారు. ముఖ్యమంత్రి తాను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఎన్నికల వాగ్దానం చేశారని తెలిపారు. ఇప్పుడు మాట తప్పి కరెంటు ఛార్జీలను పెంచడం చాలా దుర్మార్గమన్నారు. పెరిగిన కరెంటు బిల్లులను పేదలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు ఇప్పటికే పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు గోరంత ఇచ్చి కొండంత లాగేసుకొని ఖజానా నింపుకుంటుందని దుయ్యబట్టారు. ఇది రాజన్న పాలనేనా అని తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు మళ్లీ స్మార్ట్ మీటర్లు బిగించి ప్రజలు రైతుల దగ్గర కరెంటు ఛార్జీలను పెంచి ప్రజల నుండి దోపిడీ చేయాలని చూస్తుందని ఎద్దేవా చేశారు. అదానీ, అంబానీ లాంటి బడా కార్పొరేటర్లకు లాభాలు చేకూర్చి, ప్రజలపై భారాలు మోపే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ జపం చేస్తూ కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన సంస్కరణలను అమలు చేస్తున్నారని తెలిపారు. దానివల్ల ప్రజలపై భారాలు పడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన నవరత్నాల పాలన నీరుగారిపోయే విధంగా ఉందని తీవ్రంగా దుయ్యబట్టారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ప్రజలపై భారాలు మోపే ఆలోచనను స్వస్తి పలకాలని వెంటనే పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు వామపక్ష పార్టీలు పోరాటాన్ని కొనసాగిస్తామని, పోరాటాల ద్వారానే ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కె.నరసింహం రావు, తదితరులు పాల్గొన్నారు.










