ప్రజాశక్తి-ఉరవకొండ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంట్ ఛార్జీల వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో కాంగ్రెస్, సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా కరెంటు ఛార్జీలు పెంచుతూ పేదల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. ప్రజల కళ్లుగప్పి దొడ్డిదారిన సర్దుబాటు పేర్లతో భారం మోపడం తగదన్నారు. ఇది చాలదన్నట్లు స్మార్ట్ మీటర్ల పేరుతో సామాన్యులను నడ్డి విరుస్తూ, కార్పొరేట్ల జేబులు నింపాలని చూస్తోందన్నారు. గతంలో రూ.80 వస్తున్న కరెంట్ బిల్లు అమాంతంగా రూ.450 వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. పేదలకు ఉచిత పథకాలతో రూ.10 ఇచ్చి, పన్నుల రూపంలో రూ.100 లాక్కోవడం అధికార పార్టీకే చెల్లిందన్నారు. వెంటనే విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మధుసూదన్, జిల్లా కమిటీ సభ్యులు రంగారెడ్డి, శ్రీనివాసులు, సిద్ధప్ప, మురళి, సంపత్, కాంగ్రెస్ మండల కన్వీనర్ ఓబులేసు, పార్టీ నాయకులు సోనియా సీన, అబ్బాస్, తదితరులు పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న వామపక్ష, కాంగ్రెస్ నాయకులు










