Oct 14,2023 22:29

మాట్లాడుతున్న మంత్రి ప్రసాదరావు

* టిడిపి నిరసనలపై మంత్రి ధర్మాన విమర్శ
శ్రీకాకుళం అర్బన్‌ :
కొవ్వొత్తులు వెలిగిస్తే, దివిటీలు పట్టుకుంటే చేసిన పాపాలు కరిగి పోతాయా? నీతిమంతులైపోతారా? టిడిపి నిరసనలపై రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. గార మండలం కొత్తూరు సైరిగాంలో శనివారం జరిగిన గడపగడపకూ కార్యక్రమంలో ఆయన హాజరై మాట్లాడారు. చట్టం ముందు అందరూ సమానమేనని, చంద్రబాబు ప్రజాధనం దుర్వినియోగం చేశారని, సిఐడి కేసు పెట్టిందని, ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్‌ డైరెక్టరేట్‌, ఆదాయపన్ను శాఖ విచారణల్లోనూ తేలిందన్నారు. స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌తో తాము ఒప్పందం కుదుర్చుకోలేదని సీమెన్స్‌ సంస్థ స్పష్టం చేసిందన్నారు. ఆ సంస్థ పేరుతో షెల్‌ కంపెనీలకు, అక్కడి నుంచి చంద్రబాబు బినామీల అకౌంట్లకు ప్రభుత్వ నిధులు చేరినందునే కేసులు పెట్టి జైల్లో పెట్టారని, ఆయన దోసా, నిర్థోషా తేల్చాల్సింది న్యాయస్థానాలని ధర్మాన చెప్పారు. కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్‌ మనోహర్‌ నాయుడు, డిసిఎంఎస్‌ చైర్మన్‌ గొండు కృష్ణమూర్తి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, ఎంపిపి గొండు రఘురాం, మండల వైసిపి అధ్యక్షుడు పీస గోపి, నాటక అకాడమీ డైరెక్టర్‌ ముండేటి కృష్ణ, వైస్‌ ఎంపిపి అరవల రామకృష్ణ, సర్పంచ్‌లు మార్పు ఆదినారాయణ, మార్పు ఫృథ్వి, పీస శ్రీహరి, పార్టీ నేతలు అరంగి మణి, యాళ్ల నారాయణ పాల్గొన్నారు.