
* యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: కొఠారి సిఫార్సుల అమలుతోనే అందరికీ విద్య సాధ్యమని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. నగరంలోని యుటిఎఫ్ కార్యాలయంలో మాజీ యుటిఎఫ్ నాయకులు కొత్తకోట రామలక్ష్మి 5వ సంస్మరణ సభ సందర్భంగా సోమవారం స్మారకోపన్యాసం నిర్వహించారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజ్యాంగం-విద్య అన్న అంశంపై సెమినార్ నిర్వహిం చారు. ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు, యుటిఎఫ్ నాయకులు విజయ గౌరిలతో కలిసి పాల్గొన్నారు. ముందుగా రామలక్ష్మి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం 21వ నిబంధనలో బాలకార్మికవ్యవస్థ ఉండకూడదని, 29వ నిబంధనలలో విద్య అందరికీ సమానంగా అందించాలని, 21-ఎ నిబంధనల ప్రకారం విద్య ప్రాథమిక హక్కుగా మార్చారని అన్నారు. కానీ, రాజ్యాంగ లక్ష్యాలను ప్రస్తుత పాలకులు నెరవేర్చడం లేదన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1948లో రాధాకృష్ణన్ కమిషన్, 1956లో మొదలియార్ కమిషన్, 1966లో కొఠారి కమిషన్, 1986లో నూతన జాతీయ విద్యావిధానాన్ని కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చాయని తెలిపారు. వీటిలో విద్యారంగాన్ని కాపాడు కునేందుకు వీలుగా కొఠారి కమిషన్ తప్ప అన్ని కమిషన్లనూ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. కొఠారి కమిషన్ చెప్పిన కామన్ స్కూల్, విద్యను ప్రభుత్వ బాధ్యతగా తీసుకోవాలన్నారు. విద్యకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు 30 శాతం కేటాయించాలన్నారు. జిడిపిలో 6 శాతం నిధులు కేటాయించేలా ప్రభుత్వానికి న్యాయస్థానాలు సూచించాయని అన్నారు. కొఠారి కమిషన్ సలహాలను అమలు చేయకుండా అందరికీ విద్య అందించడం, సమాజంలో ఉన్న అంతరాలను రూపుమాపడం సాధ్యం కాదన్నారు పాలకవర్గాలకు ఉపయోగపడే విద్యా కమిషన్లు అమలు చేస్తున్న ప్రభుత్వాలు ప్రజలందరికీ ఉపయోగపడే కొఠారి కమిషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అమలవుతున్న జాతీయ విద్యా విధానం-2020 రాజ్యంగ లక్ష్యాలను నెరవేర్చే విధంగా లేదన్నారు. ప్రజలకు సంపూర్ణ విద్యనందించడం ప్రభుత్వ బాధ్యతన్నారు. విద్య కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ, మతతత్వికరణ వైపు మారే విధంగా నూతన విద్యా విధానం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యా లక్ష్యాలకు దూరంగా ఉన్న జాతీయవిద్యా విధానం-20ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిరంతరం అధ్యయనం చేస్తూ... విద్య అందరికీ ప్రభుత్వం అందించే విధంగా కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్య, సామాజిక మార్పునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ప్రశ్న, చైతన్యం విద్య నుంచి అలవడాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య నేర్పడం లక్ష్యంగా పనిచేయాలన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరి మాట్లాడుతూ రామలక్ష్మి మహిళా ఉపాధ్యాయులను ఉద్యమం వైపు ఆకర్షించడానికి తపన పడేవారిని తెలిపారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, రెడ్డి మోహనరావు మాట్లాడుతూ విద్య ప్రభుత్వ బాధ్యత అని, కానీ, ప్రభుత్వం విద్య మార్కెట్ శక్తులకు వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కిషోర్ కుమార్ మాట్లాడుతూ సంఘం అభివృద్ధిలో కీలకమైన నిర్మాణంలో రామలక్ష్మి పాత్ర అమోఘమని, ఆమె స్ఫూర్తితో మహిళలు ఉద్యమంలోకి రావాలని కోరారు. అనంతరం స్ఫూర్త పెన్షన్ విధానం ఈ సంస్మరణ సభలో కవితల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి ఎం.వాగ్దేవి, జిల్లా గౌరవ అధ్యక్షులు కె.వైకుంఠరావు, సహాధ్యక్షులు ఎల్.బాబూరావు, బి.ధనలక్ష్మి, కోశాధికారి బి.శ్రీరామ్మూర్తి, జిల్లా కార్యదర్శులు జి.సూర్యప్రకాశరావు, జి.సురేష్, పి.వసుందరాదేవి, బి.శారద, ప్రజా సంఘాల నాయకులు పి.తేజేశ్వరరావు, చింతాడ రామారావు, వి.జె.కె.మూర్తి పాల్గొన్నారు.