
కోటబొమ్మాళి: కొత్తమ్మతల్లిని స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజు దంపతులు, రాష్ట్ర కళింగ కార్పోరేషన్ చైర్మన్ పేరాడ తిలక్‌లు గురువారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహాధికారి వాకచర్ల రాధాకృష్ణ, ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ బోయిన మాధవి కృష్ణారావులు స్వాగతం పలకగా వేదపురోహితులు సుసరాపు గణపతిశర్మ, లకీëకాంతం శర్మలు పూర్ణకుంభంతో వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, స్థానిక జూనియర్ సివిల్ జడ్జి డి. భరణిలు కొత్తమ్మతల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కాగా శ్రీకాకుళంకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ అమ్మవారిని అదర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి వితరణగా రూ. లక్ష నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో సంతబొమ్మాళి జెడ్‌పిటిసి పాల వసంతరెడ్డి, ఎంపిపిలు రోణంకి ఉమామల్లేశ్వరరావు, ఎన్. శ్రీరామ్మూర్తి, కళింగ కార్పోరేషన్ డైరెక్టర్ హేమసుందరరాజు, పిఎసిఎస్ అద్యక్షుడు బాడాన మురళి, టెక్కలి సిఐ సూర్యచంద్రమౌళి, కోటబొమ్మాళి ఎస్‌ఐ షేక్ మహ్మద్‌అలీ, వైఎస్ ఎంపిపిలు బోయిన నాగేశ్వరరావు, దుక్క రోజారామకృష్ణ, సర్పంచ్ కాళ్ల సంజీవరావు పాల్గొన్నారు.
ముగిసిన ఉత్సవాలు
స్దానిక శ్రీ కొత్తమ్మతల్లి జాతర ఉత్సవాలు అంబరాన్ని తాకాయి. మంగళవారం నుండి గురువారం వరకు మూడు రోజులు పాటు జరిగిన ఈ ఉత్సావాలు చివరి రోజైన గురువారం అత్యంత వైభవంగా ముగిసాయి. వేలాది సంఖ్యలో కొత్తమ్మతల్లిని దర్శించుకోని మొక్కులు తీర్చుకున్నారు. కొత్తపేట జంక్షన్ నుండి కోటబొమ్మాళి వరకు రెండు కిలోమీటర్లు దారి పొడవున రద్దీ ఉండడంతో పాదచారులు, వాహానదారులు నానా అవస్థలు పడ్డారు. పోలీస్ శాఖ ట్రాపిక్ కంట్రోల్ చేయడానికి పలు చోట్ల వాహనాలను పార్కింగ్ చేయించారు. రెడ్డిక వీధిలో గల కమ్మకట్టు చిన్నఅప్పలస్వామి ఇంటి నుండి అమ్మవారి జంగిడిని పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు మధ్య ఊరేగింపుగా వచ్చి అమ్మవారి దండకం చదివి చల్లదనం చేసారు. రైసు మిల్లర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నసంతర్పణలో వేలాది మంది యాత్రికులు పాల్గొన్నారు.
పోలీస్ సేవలు భేష్ : జాతర సందర్బంగా పోలీసులు అందించిన సేవల పట్ల భక్తులు పోలీస్ శాఖకు మంచి కితాబు ఇచ్చారు. టెక్కలి సిఐ సూర్యచంద్రమౌళి ఆధ్వర్యంలో కోటబొమ్మాళి ఎస్‌ఐ షేక్ మహ్మద్‌అలీ పర్యవేక్షణలో సుమారు 400 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కొత్తమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో పోలీస్ కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి గ్రామమంతా సిసి కెమెరాలు, డ్రోన్‌లు ఏర్పాటు చేసి సిఐ ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకోని సిబ్బందిని అప్రమత్తం చేసారు. దీంతో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.