Mar 15,2023 21:11

కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగుల నిరసన
ప్రజాశక్తి - భీమవరం
నూతన పిఆర్‌సి ని వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టరేట్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు చేపట్టిన నిరసన ఏడో రోజు బుధవారం కూడా కొనసాగింది. కలెక్టరేట్లో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నినదించారు. సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ను అమల్లోకి తేవాలని డిమాండ్‌ చేశారు. పిఆర్‌సి బకాయిలు ఇవ్వాలని, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, సచివాలయాల్లో ఉద్యోగులకు లక్ష్యాలను తొలగించి పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఎపి జెఎసి అమరావతి ఆధ్వర్యంలో ఆందోళన సాగిస్తామని స్పష్టం చేశారు.