Oct 21,2023 23:35

కొత్త ఆలోచనలు, వ్యూహాలు

   నేటి రాష్ట్ర రాజకీయాలు సంక్లిష్టమై సంక్షోభితంగా తయారవుతున్నాయి. ఫలితంగా ప్రధాన పార్టీలో ప్రజా సమస్యలను పక్కనబెట్టి పరస్పర దూషణలకు ప్రాధాన్యత ఇవ్వడం చూస్తున్నాం. జిల్లాలోనూ అందుకు మినహాయింపు లేదు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జెండాతో ముందుకెళ్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు 40 రోజులుగా రిమాండ్‌లో ఉండడంతో చివరికి ఆ పార్టీ ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తుంది. అధికార పార్టీ దూకుడు పెంచింది. జిల్లాలో మార్పులు, చేర్పులు చేయాల్సిన అభ్యర్థుల ఎంపికపై రసవత్తరమైన కసరత్తు ప్రారంభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఉత్తరాంధ్ర మంత్రులు, జిల్లా నేతల దృష్టి ప్రత్యేకంగా టెక్కలి నియోజకవర్గం పడినట్లు తెలిసింది. టెక్కలి నియోజకవర్గంలో గత ఎన్నికల నుంచి జరుగుతున్న చరిత్ర అందుకు కారణమైనట్లు తెలిసింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై అధినేత జగన్‌ ప్రత్యేక దృష్టి ఉన్నట్లు తెలిసింది. ఆయనను గత ఎన్నికల్లో పార్లమెంట్‌కు పోటీ పెట్టి శాసనసభకు పి.తిలక్‌కు పంపించే ప్రయత్నం చేశారు. ఆ రెండు ప్రయత్నాలూ నేతలు సఫలం చేయడంలో విఫలమయ్యారు. ఆ తరువాత ఆ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ఊపందుకున్నాయి. ఫలితంగా దువ్వాడ శ్రీనివాస్‌కు ఇన్‌ఛార్జి పదవి కట్టబెట్టారు. ఆ తరువాత శాసనమండలికి పంపించారు. దీంతో మళ్లీ టెక్కలి తనకే వస్తుందని తిలక్‌ భావించినట్టు తెలిసింది. ఆ తరువాత జగన్‌ నియోజకవర్గంలో గాలినితీసేశారు. టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసేనని, అందరూ నేతలూ గెలిపించుకుని రావాలని సభలో జగన్‌ పిలుపునిచ్చారు. అక్కడితో సమస్య కొత్త రూపం దాల్చింది. దువ్వాడ శ్రీనివాస్‌ దంపతుల మధ్య వచ్చిన బేదాభిప్రాయాలు నియోజకవర్గం రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపాయి. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో కొత్త సమస్యలు ప్రచారంలోకి వచ్చాయి. చివరికి అధినేత వద్ద ఫిర్యాదు చేసే తీవ్రస్థాయికి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనం తరం దువ్వాడ శ్రీనివాస్‌ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక నుంచి నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా దువ్వాడ వాణి ఉంటారని, ఎన్నికల్లో ఆమెకే టిక్కెట్‌ వస్తుందని ఈ విషయం జగన్‌ చెప్పమన్నారని పాత్రికేయుల సమావేశంలో శ్రీనివాస్‌ ప్రకటించడం విశేషం. దీంతో కుటుంబాంలోని బేదాభిప్రాయాలు సమసిపోయాయని నేతలు భావించినట్లు తెలిసింది. అది వారి భావనగానే మిగిలిపోయింది. పరిస్థితులు మరింత తీవ్రతరమైనాయని జరిగిన పరిణామాలు చెబుతున్నాయి. దీంతో జిల్లా ముఖ్య నేతలు, ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్‌ సుబ్బారెడ్డి, ఇన్‌ఛార్జి బొత్స సత్యనారాయణ సమక్షంలో జిల్లాలోని ముఖ్య నేతలతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారని రాజకీయాల్లో ప్రచారం మొదలైంది. టెక్కలి నియోజకవర్గ సమస్య పరిష్కారానికి ఆ కుటుంబం నుంచే కొత్త వారిని తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాజకీయాల్లో ప్రవేశించిన డాక్టర్‌ ధానేటి శ్రీధర్‌ను టెక్కలి బరిలో దించాలన్న ఆలోచన చేస్తున్నారని తెలిసింది. దువ్వాడ శ్రీనివాస్‌కు డాక్టర్‌ శ్రీధర్‌ తోటల్లుడవుతారు. ఈ ప్రతిపాదనను నేతలు జగన్‌ వరకు తీసుకెళ్లారని తెలిసింది. కారణాలు ఏమైనాప్పటికీ శ్రీనివాస్‌పై జగన్‌కు ప్రత్యేక అభిమానం ఉన్నట్లు స్పష్టమైంది. ఆ ప్రతిపాదనను ఆయన ఆమోదం తెలుపుతారా! అన్నది చర్చనీయామైంది. అంతేకాదు ఈ సరికొత్త ప్రతిపాదనకు శ్రీనివాస్‌, వాణి అంగీకరించాల్సి ఉంటుంది. లేకుంటే కథ మళ్లీ మొదటికి వస్తుంది. అందువల్ల టెక్కలి నియజకవర్గంలో అభ్యర్థి ఖరారు విషయంలో అంత తొందరగా కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నరసన్నపేట నియోజ కరవ్గంలో అభ్యర్థి మారనున్నట్లు స్పష్టమవుతుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారని తెలిసింది. ఆయన స్థానంలో తనయుడు కృష్ణచైతన్యను బరిలో దించనున్నారని తెలిసింది. తన తనయుడికి టిక్కెట్‌ ఇస్తే తాను ఎంపీగా బరిలో దిగడానికి సిద్ధమేనని జగన్‌కు కృష్ణదాస్‌ చెప్పినట్లు తెలిసింది. అందువల్ల ఇన్నాళ్లు ప్రతిష్టంభనలో ఉన్న పార్లమెంట్‌ టిక్కెట్‌ దాదాపు ఖరారైనట్లు భావిస్తున్నట్లు తెలిసింది. టెక్కలి సీటు గెలవడమన్నది వైసిపికి ప్రతిష్టగా మారింది. ఆ సీటుతో పాటు ఎంపీ సీటుకూ నష్టం లేకుండా చర్యలు త్వరితగతిన తీసుకోవడంలో జిల్లా నేతల జోక్యం ఉన్నట్లు తెలిసింది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో రాజకీయ చిత్రం రంగులు మారుతున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ స్థానంలో ఇన్‌ఛార్జి మంత్రి బొత్స మేనల్లుడు చిన్న శ్రీను రంగప్రవేశం చేయడానికి పావులు కదపుతున్నారని తెలిసింది. ఆ నియోజకవర్గంలో అసమ్మతి గూడుకట్టి ఆ బృందాన్ని జగన్‌ వద్దకు తీసుకెళ్లడంలో సఫలీకృతమైనట్లు తెలిసింది. కిరణ్‌కుమార్‌కు బదులు చిన్న శ్రీనుకు టిక్కెట్‌ ఇస్తే మోమందరం కలిసి గెలిపించుకొస్తామని ఆ బృందం జగన్‌తో చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందువల్ల జిల్లా నేతల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం అభ్యర్థి ఎంపిక చర్చనీయాంశంగా ఉందని తెలిసింది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నర్తు రామారావును ఎమ్మెల్సీ చేయడం ద్వారా గ్రూపు రాజకీయాలకు తెరదించుతామన్న జగన్‌ అభిప్రాయానికి ఎదురు గాలి మొదలైంది. యాదవ్‌ సామాజికవర్గం లోని కొందరు నేతలు రెడ్డిక సామాజిక వర్గాన్ని కదిలించి మీరు టిక్కెట్‌ అడగండి మా మద్దతు ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. ఆ ప్రతిపాదన జిల్లా నాయకత్వం పూర్తిగా తిరస్కరిం చినట్లు తెలిసింది. ఈ సారి పిరియా సాయిరాజ్‌ స్థానంలో ఆయన భార్య, జెడ్‌పి చైర్‌పర్సన్‌ విజయను బరిలో దించడానికి నాయకత్వం సూత్రపాయంగా అంగీకరించినట్లు తెలిసింది.
ఆత్మరక్షణలో టిడిపి
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా చేసిన రాజకీయ ప్రచారం టిడిపి జిల్లాలోనూ అర్ధాంతరంగా నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబుకు రిమాండ్‌ చెప్పిన తరువాత వెనువెంటనే స్పందించడంలో నేతలు, కార్యకర్తలు జిల్లాలోనూ స్పందించడంలో వెనుకబడ్డారు. వారం తరువాత ఆర్థిక వనరులు రాష్ట్ర పార్టీ నుంచి రావడంతో నిరసన కార్యక్రమా లను ముమ్మరం చేయడం చూశాం. బాబుకు బెయిల్‌ వస్తుందన్నదానికంటే కేసును కొట్టివేస్తారన్నదానిపై సుదీర్ఘ జాప్యం కావడంతో పచ్చదండులో నీరసం ఆవహించింది. ఇప్పుడు జిల్లాలో బాబు వెంటే నేను కార్యక్రమంలో పోస్టర్లను పంపిణీ చేస్తున్నారు. రాజకీయ కార్యక్రమం కాకుండా బాబు వెంట నేను అన్నది ఆత్మరక్షణ కార్యక్రమంగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. ఎప్పుడూ విజన్‌ గురించి మాట్లాడే బాబు ఇలాంటి సంక్షోభ సమయంలో అవసరమైన ప్రణాళిక టిడిపి వద్ద కొరవడినట్లు స్పష్టమవుతుంది. వారం రోజులుగా ఎలాంటి నిరసన కార్యక్రమాల్లేవు. ఈ నెల 23న పవన్‌ కళ్యాణతో సమావేశమై కార్యాచరణ రూపొందిస్తారన్న ప్రచారం ఉంది. ఈ నెల 26న వైసిపి ఇచ్ఛాపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభించనుంది. దానికి ధీటుగా టిడిపి కార్యక్రమాలు జిల్లాలో ఏ రకంగా ఉంటాయో వేచిచూడాల్సి ఉంది.!
- సత్తారు భాస్కరరావు