
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: ప్రజా ఉద్యమాల్లో కొరటాల సత్యనారాయణ ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉందని, ఆయన ఆశయ సాధనకు మరింత కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.కృష్ణమూర్తిలు పిలుపునిచ్చారు. నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో పార్టీ జాతీయ నాయుకులు కొరటాల సత్యనారాయణ శత జయంతి సభ ఆదివారం నిర్వహించారు. సభలో ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ సత్యనారాయణ నిరంతరం కార్మిక, రైతాంగ, ప్రజా సమస్యలు పరిష్కారానికి అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. అణగారిన వర్గ ప్రయోజనం కోసం నిరంతరం కృషి చేసిన ఆయన చట్టసభల్లో సైతం వారి గొంతు కోసం ప్రశ్నించారన్నారు. రైతాంగ పోరాటంలో జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఉవ్వెత్తున సాగిన ప్రజా ఉద్యమంలో పాల్గొన్న ఆయన ఉద్యమానికి మద్దతుగా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారన్నారు. నాడు రాజీనామాలు చేసిన శాసనసభ్యుల్లో తానూ ఒకరని గుర్తు చేశారు. మరో వైపు శ్రామిక సమస్యలు పరిష్కారానికి సంఘాలు నిర్మించి అనేక ప్రయోజనాలు సాదించడానికి కృషి చేశారు. పేద రైతులు, కౌలు రైతుల ప్రయోజనాల కోసం, వృత్తిదారుల సంరక్షణకు చట్టబద్ధతను సాధించేందుకు ఎంతగానో కృషి చేశారని అన్నారు. తుది శ్వాస విడిచే వరకు మార్క్సిస్టు సిద్దాంతంపై అత్యంత విశ్వాసంతో కమ్యూనిస్టుగా పనిచేశారన్నారు. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమానికి పోలాకి ప్రసాదరావు అధ్యక్షత వహించగా పలువురు వక్తలు మాట్లాడారు. కార్యక్రమంలో ఎ.సోమశేఖర్, అల్లు సత్యనారాయణ, పి.గోపి, ఎం.సురేష్, కె.సూరయ్య పాల్గొన్నారు.
కొరటాల జీవితం స్ఫూర్తిదాయకం
ప్రజాశక్తి సాహితీ సంస్థను మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లడమే కొరటాల సత్యనారాయణకు మనమిచ్చే ఘన నివాళి అని ప్రజాశక్తి ఎడిషన్ మేనేజరు పి.కామినాయుడు పేర్కొన్నారు. ఎచ్చెర్ల మండలం కుశాలపురం పంచాయతీ నవభారత్ కూడలి ఇండిస్టీరియల్ ఏరియాలోని ప్రజాశక్తి ఎడిషన్ కార్యాలయంలో కొరటాల శతజయంతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కొరటాల చిత్రపటానికి కార్యాలయ సిబ్బంది పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఉన్నత కుటుంబంలో పుట్టిన ఆయన పేదల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేశారన్నారు. చేనేత కార్మికుల ప్రయోజనాల్ని కాపాడేందుకు ఆయన నేతృత్వాన అనేక పోరాటాలు నిర్వహించారన్నారు. స్వాతం త్య్రోద్యమ కాలం నుంచి వివిధ ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన సిపిఎంలో క్రియాశీలక కార్యకర్తగా మొదలై పోలిట్‌బ్యూరో సభ్యుని స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. బుచ్చిబాబు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎ.సోమ శేఖర్, ప్రకాష్, మధు, కిరణ్‌కుమార్, చింతాడ కృష్ణారావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.