అనంతపురం కలెక్టరేట్ : జిల్లాలోని కోర్టుల్లో మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు రావాలని జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ కోరారు. మంగళవారం సాయంత్రం అనంతపురం నగరం జిల్లా కోర్టు జడ్జి ఛాంబర్లో హైకోర్టు ఆదేశాల ప్రకారం పిల్లల సంరక్షణ కేంద్రాలు, కోర్టుల్లో మహిళలకు మరుగుదొడ్లు, శానిటరీ నాప్కిన్స్ ఏర్పాటు, ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక మరుగుదొడ్ల ఏర్పాటు, తదితర అంశాలపై జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి, శ్రీ సత్యసాయి జిల్లా డిఆర్‌ఒ కొండయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో హైకోర్టు ఆదేశాల ప్రకారం పిల్లల సంరక్షణ కేంద్రాలు, కోర్టుల్లో మహిళలకు మరుగుదొడ్లు, శానిటరీ నాప్కిన్స్ ఏర్పాటు చేయడం, ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక మరుగుదొడ్ల ఏర్పాటు కోసం అవసరమైన ప్రతిపాదనలు పంపించేందుకు ఎన్ని నిధులు అవసరం అవుతాయన్న విషయమై 15 రోజుల్లోగా ప్రణాళిక రూపొందించాలన్నారు. కలెక్టర్ ఎం.గౌతమి మాట్లాడుతూ పిల్లల సంరక్షణ కేంద్రాలు, కోర్టుల్లో మహిళలకు మరుగుదొడ్లు తదితర ఏర్పాటు విషయమై స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు రావాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీటీ, టింబక్ట్, మాస్, రెడ్స్, ట్రాన్స్‌జెండర్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.










