
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: దేశ వ్యాప్తంగా సహజ సంపదలను ప్రజలకు దక్కనీయకుండా కార్పొరేట్లకు పాలకులు కట్టబెడుతున్నారని, ప్రజలపై తీవ్ర నిర్భందాలను అమలు చేస్తూ నియంతృత్వపు పోకడలను అవలంబిస్తు న్నారని ఎపి రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝూన్సీ అన్నారు. శ్రీకాకుళం గిరిజనోద్యమంలో అమరులైన కోరన్న, మంగన్నలు వర్థంతి సందర్భంగా నగర శివారుల్లో నిర్మించిన స్థూపం వద్ద మంగళవారం నిర్వహించారు. ముందుగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళ్ల ర్పించారు. అనతరం జిల్లా కార్యదర్శి తాండ్ర అరుణ అధ్యక్షత సభ నిర్వహిం చారు. ఈ సభలో ఝాన్సీ మాట్లాడుతూ గిరిజన రైతాంగ ఉద్యమంలో 1967 అక్టోబరు 31న కోరన్న, మంగన్నలు తొలి అమరులయ్యారన్నారు. గిరిజన ప్రాంతంలో జరుగుతున్న దోపిడీ, పీడన, అణిచివేతలకు వ్యతిరేకంగా గిరిజన సంఘం నాయకత్వాన ఉద్యమిస్తున్న క్రమంలో భూస్వామ్య వర్గం దాడి చేసి తుపాకులతో కాల్పులు చేసి వారిని హత్య చేశారరని అన్నారు. ఈ ఉద్యమంలో 360 మందికిపైగా అమరులయ్యార న్నారు. వారి స్ఫూర్తితో ప్రస్తుత గిరిజన రైతాంగ విముక్తి పోరాటాలు కొనసాగుతు న్నాయని అన్నారు. వారి అమరత్వానికి 56 ఏళ్లు గడుస్తుందని అన్నారు. మోడీ ప్రభుత్వం 'అటవీ పరిరక్షణ బిల్లు-2023'ను తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సభలో ఎపి రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి దంతులూరు వర్మ, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.