కోగిలేరు వ్యవసాయ పొలాల్లో ఏనుగుల సంచారం
టమోటా, కొబ్బరి పంటల ధ్వంసం
ప్రజాశక్తి-పెద్దపంజాణి: మండలంలోని కోగిలేరు సమీపంలోని అటవీ ప్రాంతంలో వారం రోజులుగా ఏనుగులు సంచరిస్తూ వ్యవసాయపొలాల్లో పంటలను ధ్వంసం చేస్తుండడంతో బాధిత రైతులు ఆవేదనకు గురౌతున్నారు. మంగళవారం రాత్రి జంట ఏనుగులు సమీప పంట పొలాల్లో సంచరించి గ్రామానికి చెందిన జమునమ్మకు సంబంధించిన కొబ్బరితోట, పెద్దన్నకు చెందిన టమాట పంటలను ధ్వంసం చేశాయి. బాధితుల పిర్యాదు మేరకు సర్పంచ్ రమేష్ బాబు, పంచాయతీ కార్యదర్శి గణపతి, సచివాలయ సెరికల్చర్ అసిస్టెంట్ నరేష్, సచివాలయ సర్వేయర్ అజితలు ఏనుగుల దాడిలో రైతులు నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అటవీశాఖ అధికారుల దష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా అటవీ అధికారులు పంట పొలాలపై ఏనుగులు దాడులను నివారించేందుకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని స్థానిక రైతులకు హామీ ఇచ్చారు.










