
* జిఒ జారీ చేసిన ప్రభుత్వం
ప్రజాశక్తి - శ్రీకాకుళం : కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లను మంజూరు చేసింది. ఈమేరకు జిఒ నంబరు 202ను విడుదల చేసింది. నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. స్టేడియం నిర్మాణానికి రూ.12 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన అనుమతులు రావడంతో, వీలైనంత త్వరగా టెండర్లు పిలిచి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత యంత్రాంగాన్ని కోరినట్లు తెలిపారు. గత పాలకులు ముందుచూపు లేకుండా చేసిన తప్పిదం, తీవ్ర నిర్లక్ష్యమే స్టేడియం నిర్మాణం ఆలస్యం కావడానికి కారణమని విమర్శించారు. స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనెల 8వ తేదీ ఉదయం 7 గంటలకు కోడి రామ్మూర్తి స్టేడియం ఆవరణలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడా ప్రేమికులంతా ఈ కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని కోరారు.