కొనసాగుతున్న టిడిపి రిలే దీక్షలు
ప్రజాశక్తి-కావలి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా, టిడిపి పార్టీ కార్యాలయం వద్ద బుధవారం నియోజకవర్గ స్థాయిలోని పార్టీ కుటుంబ సభ్యులతో 26వ రోజు రిలే నిరాహార దీక్షలు ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. దీక్షలో పాల్గొన్న వారంతా ''మేము సైతం - బాబు కోసం'', ''సైకో పోవాలి- సైకిల్ రావాలి'', ''తెలుగుదేశం పార్టీ వర్థిల్లాలి'', ''మాలేపాటి నాయకత్వం వర్థిల్లాలి'', అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుబ్బానాయుడు మాట్లాడుతూ ఈరోజుకీ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా 26 రోజులుగా తాము శాంతియుతంగా ఈ రిలే నిరాహార దీక్షలను చేపడుతున్నామన్నారు. కక్ష సాధింపుతోనే ఈ ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ప్రతిఒక్కరూ చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని ఖండిస్తున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి కావాలని చంద్రబాబుపై పగబట్టి జైలుకు పంపారనే భావన ప్రజల్లో ఉందన్నారు. ముఖ్యమంత్రి చేతగాని పరి పాలనను, సైకో మనస్తత్వాన్ని గమనిస్తున్న ప్రజలు, రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఈసారి కావలిలో ఖచ్చితంగా టిడిపి జెండా రెపరెపలాడుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు బొట్లగుంట శ్రీహరి నాయుడు, దావులూరు దేవకుమార్, గొట్టిపాటి రాము, అబ్దుల్ హఫీజ్,మొగిలి కల్లయ్య, ఆవులరామకృష్ణ, అక్కిలిగుంట సూర్యప్రకాష్ రావు, గుత్తికొండ కిషోర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.










