ప్రజాశక్తి-కందుకూరు :నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 23వ రోజుకు చేరాయి. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చంద్రబాబుకు మద్దతుగా దీక్షల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు ని అరెస్టు చేసి 25 రోజులు దాటినా, స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో ఆయన పాత్ర పై సరైన ఆధారాలు చూపలేక, కోర్టులో కట్టు కథలు చెబుతున్నారని అన్నారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు. రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి చంద్రబాబుకు అండగా ఉంటామని చెప్పినందుకు నాగేశ్వరరావు వారికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించారని, వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును 70 శాతం పూర్తి చేస్తే, వైసీపీ ప్రభుత్వంలో మిగిలింది పూర్తి చేయలేక చేతులెత్తేసారని అన్నారు. రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. మూడువేల కోట్లతో ధరల స్థిరీకరణనిధి అంటూ ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీ ఏమైందని నాగేశ్వరరావు ప్రశ్నించారు. కందుకూరు ప్రాంతంలో అకాల వర్షం వల్ల పొగాకు, మిర్చి, సెనగ పంటలు దెబ్బతింటే ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. ఇదే జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రికి, స్థానిక ఎమ్మెల్యేకు కనీసం రైతులను పరామర్శించే తీరికలేదని విమర్శించారు. నాలుగేళ్ల నుంచి ప్రతినెలా ధరల స్థిరీకరణపై సమావేశం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి, వాటివల్ల రైతులకు ఎలాంటి మేలు కలిగిందో చెప్పాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని చెరువుల్లో వైసిపి నేతలు మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తూ డబ్బులు వెనకేసుకుంటున్నారని నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, నియోజకవర్గ తెలుగురైతు అధ్యక్షుడు నాదెళ్ల వెంకట సుబ్బారావు, నాయకులు ఘట్టమనేని చెంచురామయ్య, కండ్రా మాల్యాద్రి, గోచిపాతల మోషే, చిలకపాటి మధుబాబు, షేక్ రఫీ, బొద్దులూరి కొండలరావు, ఘట్టమనేని లక్ష్మీనరసింహం, ఈదర సుధాకర్, సుదర్శి శ్రీనివాసులు, ఎందేటి శ్రీనివాసులు, తల్లపనేని సుబ్బారావు, గోగినేని శివరామయ్య, తల్లపనేని రవీంద్ర, తానికొండ రమణయ్య, బైరపనేని కోటయ్య, బైరపనేని లక్ష్మీనారాయణ, చుంచు రామకోటయ్య, కోనూరు సుధాకర్, లక్కిరెడ్డి సుబ్బారెడ్డి, ఏకాంబరం వెంకటరావు, కె.సుబ్బారెడ్డి, నార్ని బాలయ్య, కల్లూరు ఆనందరావు, బెజవాడ మల్లికార్జున, మెడబలిమి సుబ్బారావు, పూనూరు వీరారెడ్డి, ఒంటేరు శ్రీనివాసరెడ్డి, కుర్రా శ్రీరాములు, రావుల రవి, చెన్నారెడ్డి మహేష్, మాదాల రవి, ఎండ్లూరి మాల్యాద్రి, చుండూరి శ్రీను, రావి సరిత, ఎస్తేరమ్మ, అత్తంటి శ్రీలక్ష్మి, కమ్మ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు ఉన్నారు.










