
* టిడిపి రిలే నిరాహార దీక్షలు ప్రారంభం
* పొందూరులో అడ్డుకున్న పోలీసులు
* టిడిపి జిల్లా అధ్యక్షుడు రవికుమార్ అరెస్ట్
ప్రజాశక్తి - విలేకరుల యంత్రాంగం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నిరసనల పరంపర కొనసాగిస్తోంది. అందులో భాగంగా జిల్లాలో పలు నియోజకవర్గ కేంద్రాల్లో 'బాబుకు తోడుగా.. నియంతపై పోరాటానికి మేము సైతం' పేరిట నిరాహార దీక్షలను బుధవారం చేపట్టారు. దీక్షల సందర్భంగా పొందూరులో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్షలకు సిద్ధమైన ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌తో పాటు పలువురు నాయకులను అరెస్టు చేశారు.
పొందూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో టిడిపి జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, రిలే నిరాహార దీక్ష ఆందోళనకు దారితీసింది. దీక్షకు పలు గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. నిరాహార దీక్షకు అనుమతి లేదంటూ పెద్దఎత్తున పోలీసులను మోహరించారు. రవికుమార్ దీక్షా స్థలికి చేరుకోకుండా ముందుస్తుగా ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. రాపాక కూడలిలో రవికుమార్ కోసం వాహనాలను తనిఖీ చేశారు. సుమారు 11 గంటల సమయంలో పోలీసుల కళ్లుగప్పి రవికుమార్ జీపులో అంబేద్కర్ కూడలికి చేరుకోవడంతో అప్పటివరకు సమీపంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా నినాదాలు చేస్తూ అక్కడికి చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి దీక్ష ప్రారంభించారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టులను నిరసిస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమదాలవలస సిఐ పైడయ్య, ఎస్‌ఐ లక్ష్మణరావు దీక్షకు అనుమతి లేదంటూ రవికుమార్‌తో పాటు టిడిపి నాయకులను బలవంతంగా పోలీస్ జీపులోకి ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. టిడిపి మండల అధ్యక్షుడు చిగిలిపల్లి రామ్మోహన్, టిడిపి నాయకులు కూన వెంకటసత్యనారాయణ, సీపాన శ్రీరంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఉదయం నుంచి ఉత్కంఠగానే...
పొందూరులో టిడిపి నిరాహార దీక్షలకు పిలుపునివ్వగా, వైసిపి కొత్త ఫించన్ల పంపిణీ, వైసిపిలోకి చేరికల కార్యక్రమాన్ని నిర్వహించడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పెద్దఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. దీంతో అంబేద్కర్ కూడలిలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అంబేద్కర్ కూడలిలో ఉదయం 9 గంటలకు టిడిపి కార్యక్రమానికి పిలుపునివ్వగా, 10 గంటలకు అదే కూడలిలో అంబేద్కర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు స్పీకర్ తమ్మినేని సీతారాం నివాళి అర్పించేందుకు నిర్ణయించారు. దీంతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. స్పీకర్ సీతారాం 10 గంటలకు అక్కడికి చేరుకుని నివాళి అర్పించి వెళ్లిపోయిన అనంతరం టిడిపి శ్రేణులు దీక్ష చేపట్టేందుకు చేరుకున్నాయి.
ఇచ్ఛాపురంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్ నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న హైడ్రామా కక్షసాధింపు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తండ్రి శవం పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి పీఠం కోసం సంతకాల సేకరణ చేసిన జగన్ చరిత్ర అందరికీ తెలిసిందేనని విమర్శించారు. చంద్రబాబు బెయిల్‌పై బయటకు వచ్చినంత వరకూ దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టిడిపి నేతలు కాళ్ల ధర్మారావు, సీపాన వెంకటరమణ, నందిగాం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయ ఆవరణలో మాజీ ఎమ్మెల్యే గుండ లకీëదేవి నాయకులతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు జల్లు రాజీవ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నరసన్నపేటలో నిర్వహించిన దీక్షలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
పలాస టిడిపి కార్యాలయంలో నిర్వహించిన నిరాహార దీక్షలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు. బొడ్డపాలో చింతల పోలమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో బొడ్డు దుష్యంత్, స్త్రీ విముక్తి మహిళా సంఘం అధ్యక్షులు రాజాం పద్మ, అన్నదాత రైతు సంఘం అధ్యక్షులు రాజాం శ్రీనివాస్ పాల్గొన్నారు.
పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ నిరాహార దీక్ష చేపట్టారు. టిడిపి నాయకులు పైల.లచ్చుమయ్య, పి.మోహనరావు, ఎ.శంకరరావు తదితరులు పాల్గొన్నారు.