Nov 03,2023 21:56

ఫొటో : మాట్లాడుతున్న టిడిపి నెల్లూరు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి

కొనసాగుతున్న హమాలీ కార్మికుల నిరసన
- సంఘీభావం తెలిపిన టిడిపి నేత చేజర్ల
ప్రజాశక్తి-కోవూరు : మండలంలోని ప్రయివేటు గోడౌన్లలో పనిచేస్తున్న కార్మికులకు కూలి రేట్లు పెంచాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన శుక్రవారమూ కొనసాగింది. గత 9 రోజులుగా ఇనమడుగు సెంటర్లోని గోడౌన్ల వద్ద ఆందోళన చేస్తున్న వారిని, టిడిపి నెల్లూరు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి ఆందోళన శిబిరాన్ని సందర్శించి, వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో హమాలీ కూలీలకు ఒక బస్తాకు రూ.7 ఇస్తుండగా కోవూరు మండలంలోని ప్రయివేట్‌ గోడౌన్లలో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు ఒక బస్తాకు రూ.2.90 పైసలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. అన్ని ప్రాంతాలలో ఏవిధంగా ఇస్తున్నారో, ఇక్కడ కూడా అదే కూలి ఇవ్వాలన్నారు.
గత తొమ్మిది రోజులుగా ఇనమడుగు సెంటర్‌ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేస్తుంటే అధికారులెవరూ కూడా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఆందోళన చేస్తున్న హమాలీలను పక్కన పెట్టి, ప్రయివేటు గోడౌన్ల యజమానులు బయట ప్రాంత వారిని తెచ్చి వారితో పనులు చేయించడం తగదన్నారు. స్థానికంగా నెలకొల్పిన పరిశ్రమలలో స్థానికులకే 70శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వమే చట్టం చేస్తే, ఇక్కడ బయట ప్రాంతం వారితో పనులు ఎలా చేయిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు కార్మికులు, ప్రయివేట్‌ గోడౌన్ల యజమానులతో చర్చలు జరిపి ఇద్దరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలన్నారు. హమాలీ కార్మికులు, వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వారు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఇంటురు విజరు, చిల్లకలూరు నిరంజన్‌ రెడ్డి, ఎస్‌కె.వహీద్‌, ఎస్‌కె.రియాజ్‌, ఎస్‌డి కలామ్‌, కాకి భగవాన్‌, తదితరులు పాల్గొన్నారు.