కొనసాగుతున్న గజ దాడులు
ప్రజాశక్తి- సోమల:
సోమల మండలం నంజంపేట పంచాయతీ ఊసలగడ్డ యానాదివాడ గ్రామంపై ఒంటరి ఏనుగు బుధవారం అర్థరాత్రి దాడిచేసి మూడు గుడిసెలను ధ్వంసం చేసి గుడిసెలలోని నిత్యావసర సరుకులు బియ్యం ఇతర వంట పాత్రలను చిందరవందర చేసి తీవ్ర నష్టాన్ని కలిగించిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. యానాది వాడలో 30కుటుంబాల వారు గతంలో ప్రభుత్వం సాగుభూమి పంపిణీ చేయగా వారి భూమిలోనే గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. అటవీ సమీపప్రాంతంలో యానాదివాడ ఉండడం వల్ల ఒంటరి ఏనుగు అర్థరాత్రి గ్రామంలో సంచరించి మూడు పూరి గుడిసెలను ధ్వంసం చేసింది. ఆ సమయంలో ఇంటిల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సిద్దయ్య, రామయ్య, భూదేవి అనే ముగ్గురి గుడిసెలను ఒంటరి ఏనుగు ధ్వంసం చేశాయి. ఈసందర్భంగా సర్పంచ్ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎన్నోఏళ్లుగా యానాదులు ఇక్కడ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. గతంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన సందర్భంగా రోడ్డు, విద్యుత్, సౌకర్యం గ్రామానికి అవసరం ఉందని తెలియజేయగా మంజూరు చేస్తామని తెలిపారని, ప్రస్తుతానికి రోడ్డు మంజూరైందని, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మంత్రి దష్టికి సమస్యను తీసుకువెళ్లి వెంటనే విద్యుత్‌దీపాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అటవీశాఖ వారు సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన సంఘటనపై అధికారులకు తెలియజేశారు. ఆ పై బాధితుల నుండి సమాచారాన్ని సేకరించి నష్టపరిహారం కోసం నివేదికలను సిద్ధం చేశారు. నిత్యావసర పంపిణీ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి సబిత, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పంట పొలాలపై గజదాడి
రూ.10 లక్షలకు పైగా రైతులకు నష్టం
బైరెడ్డిపల్లి: మండల పరిధిలోని కడపనతం, గౌనితినేపల్లి రెవెన్యూకు సంబంధించిన పలువురి రైతుల పంటలను ఏనుగుల తొక్కి నాశనం చేశారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామేగౌడుకు చెందిన మూడు ఎకరాలు, తులసీకుమార్‌కు చెందిన రెండు ఎకరాల మొక్కొజొన్న, ఎం. మనికి చెందిన 30 టెంకాయ చెట్లు, ఆరిష్ బాషకు చెందిన రెండు ఎకరాల అరటి పంట, లక్షీనారాయణకు చెందిన మూడు ఎకరాలు కంది పంట, వెంకటస్వామికి చెందిన కంది పంటలను తొక్కినాశనం చేశాయి. దీని వలన రూ.10లక్షల పైగా నష్టం వాటిల్లింది. గ్రామాల్లోకి ఏనుగులు రావడం ఎక్కువ్వడంతో అటవీ సమీపప్రాంత ప్రజలు భయందోళనతో బతుకుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పంట నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు










