Mar 15,2023 21:10

ప్రజాశక్తి - వీరవాసరం
రైతు, కార్మిక, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజావ్యతిరేక ప్రభుత్వంగా నిలిచిందని ఎపి రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు జుత్తిగ నరసింహమూర్తి, సిఐటియు జిల్లా నాయకులు ఎం.ఆంజనేయులు విమర్శించారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలిరావాలంటూ మండలవ్యాప్తంగా చేపట్టిన మోటార్‌ సైకిల్‌ యాత్ర రెండో రోజు బుధవారం కొనసాగింది. ఉత్తరపాలెంలో రెండో రోజు యాత్ర ప్రారంభం సందర్భంగా వారు మాట్లాడుతూ ఎనిమిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చే ముందు చేసిన వాగ్దానాల్లో ఏఒక్కటీ నెరవేర్చపోగా దేశంలోన్ని అన్ని తరగతుల ప్రజలపై భారాలు మోపుతున్నారన్నారు. కనీస వేతనాలు అమలు చేయకుండా సౌకార్యాలు కుదించి దేశభక్తి జపం ముసుగులో కేంద్ర ప్రభుత్వం మోసగిస్తుందన్నారు. మద్దతు ధర చట్టం చేయడానికి ఎవరు అడ్డు చెబుతున్నారో.. ఎందుకు చేయలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మరోపక్క కార్పొరేట్‌ శక్తులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ దీనిని దేశభక్తి అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఏప్రిల్‌ ఐదున చలో ఢిల్లీ కార్యక్రమంలో ఈ సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తామన్నారు. యాత్ర ఉత్తరపాలెం నుండి కొణితివాడ, రాయకుదురు, తోకలపూడి, నవుడూరు వరకు సాగింది. ఈ కార్యక్రమంలో రెడ్డి రామారావు, కేతా జ్యోతిబసు, బొబ్బనపల్లి సూర్యచంద్రరావు, గొట్టుముక్కల శ్యాంబాబు, మల్లెల సత్యనారాయణ, కిలాడి సత్యనారాయణ, రాము, అయినంపూడి బాబురావు, నారాయణమూర్తి పాల్గొన్నారు.