సిఐటియు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు
ప్రజాశక్తి -చిత్తూరు ప్రతినిధి
కుప్పంలో షాహి గార్మెంట్‌లో పనిచేస్తున్న మూడువేల మంది కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన యాజమాన్యానికి వ్యతిరేకంగా నాలుగో రోజూ గురువారం సమ్మె కొనసాగింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వాడ గంగరాజు,చైతన్య లు మాట్లాడుతూ ఆరు సంవత్సరాలుగా కార్మికులు విధులు నిర్వహిస్తున్నా వారి సమస్యలు పట్టించుకునే నాథుడే లేడని విమర్శించారు. మూడు రోజులుగా కార్మికుల సమ్మె చేస్తుంటే లేబర్ అధికారులు తూతూమంత్రంగా వ్యవహరించడం దారుణమన్నారు.వేలాదిమంది పనిచేస్తున్న చోట కనీస వసతులు లేవన్నారు. విశ్రాంతి గదులు లేవని, కార్మికుల సంఖ్యకు తగినట్లుగా మరుగుదొడ్లు లేకపోవడం సిగ్గుచేటన్నారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం కార్మికులు సమ్కె చేస్తుంటే పరిష్కరించే దిశగా ఆలోచించకుండా పోలీసులతో బెదిరింపులకు పాల్పడటం దారుణమన్నారు. కార్మిక చట్టాలు అమలు చేయని యాజమాన్యంపై లేబర్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్థిక భారం లేని సమస్యలు పరిష్కరించడానికి సైతం అధికారులు చొరవ చూపకపోవడం దారుణమన్నారు. గార్మెంట్ కార్మికుల సమస్య పరిష్కారమయ్యే వరకూ సిఐటియు వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అధ్యక్ష కార్యదర్శులుగా లక్ష్మి, శ్రీదేవి
షాహి గార్మెంట్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో నూతన కమిటిని గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా లక్ష్మి, కార్యదర్శిగా శ్రీదేవి , గౌరవాధ్యక్షులుగా చైతన్య, ఉపాధ్యక్షులుగా వాడ గంగరాజు, కిరణ్, వసంత్, శోభ, కాంతమ్మ, మహాలక్ష్మి, సహాయ కార్యదర్శులుగా రాజేంద్ర, మంజునాధ, కోశాధికారిగా సత్య ఎంపికయ్యారు.










