Apr 05,2023 21:12

మిగిలినవారికి తప్పని నిరీక్షణ
గత నెల 25న బటన్‌ నొక్కి ఆసరాను ప్రారంభించిన సిఎం జగన్‌
10 రోజులు గడిచినా ఖాతాల్లో జామకాని సొమ్ము
ప్రజాశక్తి - భీమవరం
గత నెల 25న ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్‌ఆర్‌ ఆసరా మూడో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కి ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల బ్యాంక్‌ ఖాతాల్లో ఆసరా రుణమాఫీ సొమ్మును జమ చేయడం ప్రారంభించారు. అయితే ఇది జరిగి పది రోజులు గడుస్తున్నా జిల్లాలో పూర్తిస్థాయిలో స్వయం సహాయక సంఘాలకు సొమ్ము జమ కాలేదు. దీనికి అధికారులు సవాలక్ష కారణాలు చెబుతున్నారు. కొంతమందికే ఆసరా లబ్ధి చేకూరడంతో మిగిలిన సంఘాలు నిరీక్షిస్తున్నాయి.
గత టిడిపి ప్రభుత్వ హయాంలో స్వయంసహాయక సంఘాలు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తానని, అదీ నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని జగన్‌ పాదయాత్రలో మహిళలకు హామీ ఇచ్చారు. నవరత్నాల్లో భాగంగా ప్రతి మహిళా అధిక అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఆసరా కార్యక్రమానికి వైసిపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా గత నెల 25న మూడో విడత ఆసరా రుణమాఫీ సొమ్మును ముఖ్యమంత్రి జగన్‌ స్వయం సహాయక సంఘాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఆసరా మూడో విడతలో జిల్లాలో 25,878 స్వయం సహాయక సంఘాలకు చెందిన 2,56,389 మంది సభ్యులకు రూ.266.67 కోట్లు లబ్ధి చేకూరనుంది. దీనికి సంబంధించిన మాన్యువల్‌ చెక్కును గత నెల 25న కలెక్టరేట్లో జిల్లాస్థాయి ఆసరా కార్యక్రమంలో కలెక్టర్‌ పి.ప్రశాంతి స్వయం సహాయక సంఘాలకు అందించారు. అయితే రుణమాఫీ సొమ్ము ఇంకా పూర్తిగా సంఘాలన్నింటికీ పూర్తిస్థాయిలో అందలేదు. ముఖ్యమంత్రి బటన్‌ నొక్కి నిధులు విడుదల చేసి పది రోజులు గడిచినా లబ్దిదారుల ఖాతాలకు నగదు జమ కాలేదు. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు ఆర్భాటంగా సంబరాలు జరిపి నమూనా చెక్కులు అందజేస్తూ ప్రచారం చేస్తున్నారే తప్ప సొమ్ము మాత్రం బ్యాంకు ఖాతాల్లో పడటం లేదని పలు సంఘాల మహిళలు పెదవివిరుస్తున్నారు. అయితే సంఘాల బ్యాంకు ఖాతాలకు నగదు జమైనట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రతి మండలంలో ఆసరా సంబరాలు
ప్రతి మండలంలో ఆసరా సంబరాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. లబ్ధి పొందిన ప్రతి మహిళా ఇంటికి స్టిక్కర్‌ అంటించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో దీనికి సంబంధించి ప్రచార స్టిక్కర్లు, కరపత్రాలు సిద్ధం చేసి మండల మహిళా సమాఖ్య కార్యాలయాలకు, అక్కడి నుంచి ఆయా గ్రామాలు, వార్డులు, డివిజన్లకు సరఫరా చేశారు. గత నెల 25 నుంచి ఈ నెల 4 వరకు అన్ని మండలాల్లో ఆసరా సంబరాలు నిర్వహించారు. ఆసరా సంబరాలు పూర్తయిన తర్వాత ఆయా సంఘాల ఖాతాలకు నగదు జమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలాఉంటే సంబరాలు పూర్తయిన చోట కూడా ఇంకా ఆయా సంఘాల ఖాతాలకు ఆసరా సొమ్ము జమకాలేదని పలువురు మహిళలు చెబుతున్నారు. ఉండి నియోజకవర్గంలోని పాలకోడేరు కాళ్ల, ఆకివీడు, ఉండి మండలాల్లో ఒక సంఘానికి కూడా రుణమాఫీ సొమ్ము జమ కాలేదు. జిల్లావ్యాప్తంగా అనేక సంఘాలకు రుణమాఫీ నగదు జమ కాలేదని తెలిసింది. అయితే ఎన్ని సంఘాలకు నగదు జమ అయింది... ఇంకా ఎన్నింటికి జమకావాల్సి ఉందని కూడా అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. వరుసగా ప్రభుత్వ సెలవులు, బ్యాంకు సెలవులు రావడం వల్ల చాలా మండలాల్లోని ఖాతాల్లో నగదు జమ కాలేదని, ఈ నెల 10లోగా అన్ని సంఘాలకు దశల వారీగా మూడో విడత నగదు జమవుతుందని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో ఆసరా మూడు విడతల్లో రూ.800.56 కోట్లు లబ్ధి
జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు అసరా రుణమాఫీ లబ్ధి మూడు విడతల్లో రూ.800.56 కోట్లు జరిగింది. మొదటి విడతలో 25,883 సంఘాలకు చెందిన 2,58,830 మంది సభ్యులకు రూ.266.71 కోట్లు, రెండో విడతలో 25,899 సంఘాలకు చెందిన 2,58,990 మంది సభ్యులకు రూ.267.18 కోట్లు లబ్ధి చేకూర్చిందన్నారు. మూడో విడతలో ఆచంట నియోజకవర్గంలో 4875 సంఘాలకు చెందిన 48,591 మహిళలకు రూ.49.10 కోట్లు, భీమవరం నియోజకవర్గంలో 2924 సంఘాలకు చెందిన 28,985 మహిళలకు రూ.28.94 కోట్లు, నరసాపురం నియోజకవర్గంలో 3243 సంఘాలకు చెందిన 31,408 మహిళలకు రూ.33.92 కోట్లు, పాలకొల్లు నియోజకవర్గంలో 2662 సంఘాలకు చెందిన 26,965 మంది మహిళలకు రూ.26.45 కోట్లు, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 2897 సంఘాలకు చెందిన 28,483 మంది సభ్యులకు రూ.25.18 కోట్లు, తణుకు నియోజకవర్గంలో 4142 స్వయం సహాయక సంఘాలకు చెందిన 40,137 మంది సభ్యులకు రూ.41.42 కోట్లు, ఉండి నియోజకవర్గానికి సంబంధించి 5232 సంఘాలకు సంబంధించి 51880 సభ్యులకు రూ.62.63 కోట్లు మొత్తం జిల్లాలో 25,878 సంఘాలకు చెందిన 2,56,389 మంది సభ్యులకు రూ.266.67 కోట్లు లబ్ది చేకూరింది.