Jul 14,2022 22:32

కొలిక్కిరాని మరమగ్గ కార్మికుల చర్చలు
అధికారుల తీరు దారుణం
తహశీల్దార్‌ని పిలవని వైనం
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి, నగరి:

మరమగ్గ కార్మికులకు కూలి రేట్లు పెంచాలని కోరుతూ ఈనెల 5 నుండి 12వ తారీఖు వరకు నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఏకాంబరకుప్పం రైల్వేస్టేషన్‌ సమీపాన నిరవధిక సమ్మె చేపట్టారు. సమ్మెపై ప్రభుత్వ అధికారులు గానీ మాస్టరు వీవర్స గానీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బుధవారం చెన్నై - తిరుపతి హైవే మీద దాదాపు మూడు గంటలసేపు బైఠాయించడంతో అయిదు కిలోమీటర్‌ మేరకు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి. తిరుపతికి వెళ్లాల్సిన జెడ్‌ కేటగిరీ భద్రత ఉన్న వీఐపిలతో సహా పలువురు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో జిల్లాస్థాయి అధికారుల నుండి ఒత్తిడి రావడంతో హుటాహుటిన నగరి ఆర్డీవో సజన, తహశీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి, సిఐ. శ్రీనివాసంతి ఆగమేఘాల మీద సంఘటనా స్థలానికి చేరుకుని మరమగ్గ కార్మికులతోనూ, అటు మాస్టర్‌ వీవర్లతోను చర్చలు జరిపారు.
గురువారం ఇరు వర్గాలను కూడా స్థానికంగా ఉన్నటువంటి ఓప్రైవేటు కల్యాణ మండపంలో చర్చలకు పిలిపించారు. ఒకపక్క చర్చలు జరుగుతుండగా మరోపక్క నగరి తహశీల్దార్‌ కార్యాలయానికి పెద్దసంఖ్యలో మరమగ్గ కార్మికులు చేరుకుంటున్నారన్న సమాచారం తెలియడంతో పోలీసులు అప్రమతమై కార్మికులకు ఎవర్ని కూడా తహశీల్దార్‌ కార్యాలయం దగ్గరికి రానీయకుండా పంపించడం జరిగింది. మాస్టర్‌ వీవర్స్‌ తరపున దాదాపు 90మంది యాజమానులు పాల్గొనగా మరమగ్గ కార్మికుల తరపున అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు పెరుమాళ్‌, సిఐటియు జిల్లా కార్యదర్శిపి.చైతన్య, జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు, నగరి నియోజకర్గ కార్యదర్శి వెంకటేష్‌, షణ్ముగం, జగదీష్‌లతోపాటు 20 మంది కార్మికులను చర్చలకు అనుమతించారు. అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి సిఐటియు నాయకులను, తహశీల్దార్‌ను చర్చలకు పిలవకుండానే చర్చలు జరపడం దారుణం.
మొదటి రౌండ్‌ చర్చల్లో ఒక రూపాయి మాత్రమే పెంచగలుగుతామని మాస్టర్‌ వీవట్లు తెలిపారు. రూపాయి అయితే తమకు గిట్టుబాటు కాదని మరమగ్గ కార్మికులు ఒప్పుకోకపోవడంతో ఆ తర్వాత రెండో రోజు చర్చలలో రెండు రూపాయల మేరకు పెంచుతామని మాస్టర్‌ వీవర్లు దిగిరావడం, రెండు రూపాయలు కూడా చాలదని, గత పది సంవత్సరాలకు ముందు కూలిరేట్లు 10 రూపాయలు పెంచారని, కరోనా కారణంగా 10 రూపాయలు నుంచి రెండు రూపాయలు తగ్గించి ప్రస్తుతం మీటర్‌కు ఎనిమిది రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలను గరిష్టంగా పెంచేసిందని, మాస్టర్‌ వీవర్లు ఇచ్చే 8 రూపాయల నుంచి రెండున్నర రూపాయలు విద్యుత్‌ ఛార్జీలకే సరిపోతుందని తమ కష్టాలను, గోడులను ఆర్డీఓకి, లేబర్‌ అధికారికి చెప్పుకొచ్చారు. మరమగ్గ కార్మికులను, మాస్టర్‌ వీవర్లను ఒప్పించే ప్రయత్నంలో మరమగ్గ కార్మికులకు కష్టాలు ఎక్కువ ఉన్నాయని, కరెంట్‌ చార్జీలు కూడా పెరిగిపోయాని, నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి మాస్టర్‌ వీవర్లు కాస్త మానవతా దక్పథంతో ఆలోచించాలని అధికారులు సూచించడంతో, రెండు రూపాయల 50 పైసలు ఇస్తామని అధికారాలకు నామమాత్రపు మాటలు ఇచ్చి మాస్టర్‌ వివర్లు చర్చల నుండి అర్ధాంతంగా వెళ్లిపోయారు. దీంతో ఈరోజు చర్చల్లో కూలిరేట్లు కొలిక్కి వస్తుందనే ఆశతో ఎదురు చూసిన మరమగ్గ కార్మికులు, కార్మికుల కుటుంబ సభ్యులకు నిరాశే మిగిలింది. ఆర్డీవోతో సహా లేబర్‌ అధికారులు తమకు ఇంకో రెండు రోజులు సమయం కావాలని ఈరోజు హాజరు కానీ మాస్టర్‌వివర్లకి నోటీసులిచ్చి పిలిపించి, మరమగ్గ కార్మికులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మరమగ్గ కార్మికులు నిరాశతో చర్చల నుండి వెనుదిరిగారు. మాస్టర్‌ వీవర్లు కార్మికుల మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాకుండా పోయింది. బయటకొచ్చిన సిఐటియు నాయకులు మాట్లాడుతూ అధికారులకు సమయం ఇస్తున్నామని రెండు రోజుల తర్వాత కనీసం తమకు మూడు రూపాయలు అయినా కూలిరేట్లు పెంచకపోతే మళ్లీ సమ్మెబాట పడుతామని తెలియజేశారు.
భాద్యతారాహిత్యంగా లేబర్‌ అధికారి..
సమస్య పరిష్కారం చేయాల్సిన లేబర్‌ అధికారి సమస్యను పెంచే పద్ధతిలో వ్యవహరించడం దారుణం. కార్మికులకు న్యాయం చేసే పద్ధతుల కాకుండా యాజమాన్యాలకు తొత్తులుగా మాట్లాడడం దుర్మార్గం. మొదటి రోజు నుండే కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఏసీఎల్‌ పై చర్యలు తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలి. వేలాదిమంది కార్మికులున్న చోట జెసిఎల్‌ చేసుకోకుండా ఏసీఎల్‌కి అప్పగించడం ఏమిటి. ఇప్పటికైనా జెసిఎల్‌ జోక్యం చేసుకొని కార్మికులకు కూలి రేట్లు పెంచే విధంగా చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు లేబర్‌ అధికారుల బాధ్యత వహించాల్సి ఉంటుంది.
- వాడా గంగరాజు, పి.చైతన్య, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు