Sep 25,2023 22:01

ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న రైతులు

*ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.మోహనరావు
ప్రజాశక్తి - పలాస, కంచిలి:కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, వెయ్యి కొబ్బరి కాయలకు రూ.15 వేలు కనీస ధర ఇవ్వాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహనరావు డిమాండ్‌ చేశారు. పలాస ఆర్‌డిఒ కార్యాలయం వద్ద కొబ్బరి రైతుసంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాఫెడ్‌, ఆయిల్‌ ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి కొబ్బరి కాయలు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కొబ్బరి రైతులకు ధరల స్థిరీకరణ పథకం వర్తింప చేయాలన్నారు. జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, ఎర్రనల్లి, తెల్లదోమ వంటి తెగుళ్లు నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. ఉద్యాన శాఖ ద్వారా కొబ్బరి రైతులకు సబ్సిడీ పథకాలు అందించాలని, కేంద్ర ప్రభుత్వం విదేశీ కొబ్బరి ఉత్పత్తుల దిగుమతులను నిషేధించాలని, 90 శాతం సబ్సిడీతో డ్రిప్‌ పరికరాలు అందించాలని కోరారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగింపు ఆపాలని, ఉచిత విద్యుత్‌ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో వేలాది ఎకరాలలో కొబ్బరి పంటను రైతులు సాగు చేస్తున్నారని, కొబ్బరి కాయలకు కనీస ధరలు రాక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరా కొబ్బరి తోటకు ఏడాదికి రూ.40 వేలకు పైగా పెట్టుబడి అవుతోందన్నారు. అనంతరం ఆర్‌డిఒ కార్యాలయం ఎఒ పి.ప్రభకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జీడి రైతుసంఘం జిల్లా కన్వీనర్‌ తెప్పల అజరు కుమార్‌, కొబ్బరి రైతు సంఘం నాయకులు ఎం.జోగారావు, ఎం.కామేశ్వరరావు, పి.తాతారావు, వి.సాంబమూర్తి, వజ్రపుకొత్తూరు రైతు సంఘం మండల అధ్యక్షుడు కె.బాలాజీరావు పాల్గొన్నారు.
కంచిలిలో సచివాలయ కార్యదర్శికి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు కె.గోపీనాథ్‌, ఆబోతు ఢిల్లీరావు, మన్మథరావు, జోగయ్య, రామయ్య, దాసు పాల్గొన్నారు.