కనుమరుగైన 'ఖరీఫ్' సేద్యం
ప్రజాశక్తి- గంగవరం: మండలంలో గత సంవత్సరం వర్షాలు పుష్కలంగా పడి చెరువులు పూర్తిగా నిండంతో వరిసాగు చేసే రైతులు ఆసక్తి చూపి 15వేల హెక్టార్ల నుండి 20వేల హెక్టార్ల వరకు వరి పంటను పండించారు. అయితే దీనికి భిన్నంగా ఈసంవత్సరం ఖరీప్ సీజన్ పూర్తికావస్తున్నా ఇప్పటి వరకు వరి పంట సాగుచేయడానికి, నారు విత్తడానికి గానీ, ఆసక్తి చూపకపోవడంతో వ్యవసాయం పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం లేకపోలేదు. అంతేకాకుండా భవిష్యత్తులో వరి ధాన్యం కోసం వెంపర్లాడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, కుంటలు నిండుగానే ఉన్నటప్పటికీ వ్యవసాయం చేయడానికి పెట్టుబుడులు అధికమవ్వడంతో రైతులు సాగు వైపు మొగ్గుచూపడం లేదు. ప్రత్యామ్నాయ పనులు చేసుకుంటూ వ్యవసాయానికి దూరమవుతున్నారు.
ఏడాది కష్టపడిన రైతుకు ఒరిగిందేమీ లేదు..
సాధారణంగా ఒక ఎకరాలో వరి పంట సాగు చేయాలంటే రైతుకు రూ.25 నుంచి 35వేల వరకు ఖర్చు అవుతుంది. ఇక కూలీలు, కలుపు తీత వంచి ఖర్చులు లేకపోలేదు. ఇంత పెట్టుబడి పెట్టి కష్టించి పండించినా ధాన్యంకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దీంతో చేసిన అప్పులు తీర్చ లేక రైతులు వ్యవసాయానికే దూరం అవుతున్నారు. ప్రస్తుతం వరి ధాన్యం బస్తా ధర రూ.1200లు నుంచి 1400లు లోపే ఉంది. ఈ ధరతో ధాన్యం అమ్మితే రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదు.. పైదా నష్టపోతామని విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే మార్కెట్‌లో మాత్రం బియ్యం ధర రూ.50 నుంచి 60ల వరకు ఉంది. పండించిన రైతులు, కొన్న కొనుగోలు దారులు నష్టపోతుండగా మధ్యలో దళారులు, వ్యాపారస్తులు మాత్రం సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం పూర్తిగా కనుమరుగవుతోంది.
ఆర్‌బికెల్లో ప్రభుత్వం రైతులకు సబ్సిడీ కింద వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసినా ఒకబస్తా రూ.1550లు ఉంటోంది. రైతులు కష్టపడి సాగుచేసి పండించి మార్కెట్‌లో దళారులు అమ్మగా వారు అధిక ధరకు అమ్ముకొని వంట నూనెగా, ఆహారపదార్ధాలుగా తయారు చేసి ఉపయోగిస్తున్నారు. దీంతో వేరుశనగ రైతులు సైతం పంటను పండించడానికి ఆసక్తి చూపడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో వ్యవసాయం అనేది కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.










