కనులపండువగా రథోత్సవం
ప్రజాశక్తి- ఐరాల: స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు భాగంగా సోమవారం ఉదయం దేవస్థానం వారిచే స్వామివారి మూలవిరాట్‌కు వివిధ రకాల పరిమళ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం సిద్ధి బుద్ధి సమేత ఉత్సవమూర్తులను వేద పండితులచే మంత్ర ఘోష చరణాల నడుమ అభిషేకించి రథంపై ఉంచారు. ఆనవాయితీ ప్రకారం మొదట కొంత దూరం లాగి వదిలిన ఆలయ పాలకమండలి, అధికారులు, ఉభయదారులు అనంతరం మంగళ వాయిద్యాలు నడుమ, కోలాటాలు, డ్రమ్స్, వివిధ రకాల సాంస్కతిక కార్యక్రమాల నడుమ రథోత్సవంను కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారికి కర్పూర హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ చైర్మన్ ఏ.మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు, ఈఈ వెంకటనారాయణ, ఏఈఓలు ఎస్‌వి కష్ణారెడ్డి, రవీంద్రబాబు విద్యాసాగర్‌రెడ్డి, హరి మాధవరెడ్డి, హేమమాలిని, సర్పంచ్ శాంతి సాగర్‌రెడ్డి, సీఐ రవిశంకర్‌రెడ్డి, ఎస్సైలు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.










