కనీస వేతనానికై...
కార్మికుల ఉద్యమ పథం
రూ.26వేలు ఇవ్వాలని డిమాండు
నేడు కలెక్టరేటు వద్ద భారీ ధర్నా
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
'అరకొర జీతాలొద్దు.. కనీస వేతనం ఇవ్వాలి' అనే డిమాండుతో కార్మికులు సమర శంఖం పూరిస్తున్నారు. ఇందులో భాగంగా వారు మంగళవారం కలెక్టరేటు వద్ద భారీ ఎత్తున ధర్నా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సలహాబోర్డును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండుతో ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు.
జిల్లాలో 76 కనీస వేతనాల షెడ్యూల్స్‌్‌లో మూడు లక్షల మందికిపైగా వివిధ విభాగాలలో పని చేస్తున్నారు. పప్పులు, బియ్యం, ఆయిల్, స్పిన్నింగ్ వంటి మిల్లుల్లో, గార్మెంట్స్, ఫార్మారంగం, షాపులు, మాల్స్,ఆటోమొబైల్స్, ఇంజనీరింగ్, క్వారీ, లారీలు, ట్రాక్టర్లు, ఇటుకల తయారీ, సున్నం బట్టీలు, హేచరీలు, ప్రయివేటు ఆసుపత్రులు, విద్యాలయాలు, సెక్యూరిటీ సర్వీసులు తదితర వాటిల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ చేయకపోవడం వల్ల 15ఏళ్లుగా అర్థాకలితో అలమటిస్తున్నారు. పెరుగుతున్న ధరలకు, కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఐదేళ్లకు ఒక సారి రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి సవరించే సంప్రదాయం ఉండేది. అయితే మన రాష్ట్రంలో ఏడేళ్లుగా దీని గురించి పట్టించుకున్న వాడు లేకుండా పోయాడు. కనీస వేతనాలు ఇవ్వాలని కార్మికులు రకరకాల రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. గ్రామ పంచాయతీ వద్ద నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు వీరు ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వీరికి వేతనం పెంచడం మానేశాయి. ఇప్పటికీ ప్రయివేటు వాటిల్లో ఆరు, ఏడు వేలకు మించి ఇవ్వడం లేదు.
ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ సేవల్లో మన జిల్లాలో 50వేల మందికి పైగా స్కీమ్ వర్కర్లు ఉన్నారు. వీరికి కనీస వేతనాలు, రిటైర్‌మెంటు బెనిఫిట్స్ అమలు చేయడం లేదు. ప్రభుత్వ శాఖలు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైం కాంట్రాక్టులు, వర్క్ ఔట్‌సోర్సింగ్ కార్మికులు వీరు మరో 40వేల మంది జిల్లాలో ఉన్నారు. వీరికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదు. ఇలా ఇటు ప్రభుత్వ, అటు ప్రయివేటు రంగాల్లోని కార్మికులకు కనీస వేతనాలు రావడం లేదు. దీనిపై వారు మంగళవారం కలెక్టరేటు వద్ద ధర్నా నిర్వహించనున్నారు.
కార్మికులు నిలదీయాలి
కనీస వేతనాల సవరణ తమ జన్మహక్కుగా కనీసవేతన రంగంలోని కార్మికులు ప్రభుత్వాన్ని నిలదీయాలి. జాతీయోద్యమంలో కార్మికుల పోరాటం వల్ల వారికి గౌరవప్రదమైన జీవితాలకు అవసరమైన వేతనాలు బాధ్యతను రాజ్యాంగంలో పెట్టారు. ఐదేళక్రితం కేంద్ర వేతన సంఘం నిర్ణయించిన రూ.26వేలు చెల్లించాలి. అనే డిమాండుతో కలక్టరేటు వద్ద ధర్నా నిర్వహించనున్నాం.
పి. చైతన్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి










