కనీస వేతనాల క్యాంపెయిన్ జయప్రదం చేయండి
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అజరుకుమార్ పిలుపు
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: జూలై నెలలో రాష్ట్రవ్యాప్తంగా కనీస వేతనాలపై జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మంగళవారం సిఐటియు కార్యాలయంలో జిల్లా సమావేశం జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అజరు కుమార్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా రాష్ట్రంలో కార్మికులకు కనీస వేతనాలు నిర్ణయించే పరిస్థితి లేదని విమర్శించారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు నిర్ణయించాలి కానీ ప్రభుత్వాలు ఆ పనిచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. రాష్ట్రంలో లక్షలాది మంది కార్మికులు కనీస వేతనాలకు నోచుకోవడం లేదని అన్నారు. వేతనాలు తీసుకుంటున్న అన్నిరకాల కార్మికుల సమస్యల స్థితిగతులపై సిఐటియు జూలై నెలలో క్యాంపియిన్ చేస్తున్నామని, ఈకార్యక్రమాన్ని చిత్తూరు జిల్లాలో జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం కార్మికచట్టాలు మార్పు చేసిన తర్వాత రాష్ట్రంలో వాటిని వేగంగా అమలు చేస్తున్నారని కార్మికులు నష్టపోతున్నారని తెలిపారు. ఈ క్యాంపియిన్‌లో వచ్చిన కార్మికుల సమస్యలపై పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మరోపక్క కేంద్ర ప్రభుత్వం కార్మికుల మధ్య చిచ్చుపెడుతూ మతాల పేరుతో రెచ్చగొడుతున్నారని కార్మికవర్గం వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించకుండా కాపాడుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.చైతన్య, జిల్లా ఉపాధ్యక్షులు జ్యోతి, గిరిధర గుప్తా, చల్లా వెంకటయ్య, జిల్లా కార్యదర్శి భువనేశ్వరి, మధ్యాహ్న భోజనకార్మికులు కార్యదర్శి వరలక్ష్మి, భవననిర్మాణ కార్మిక సంఘం, హమాలీ యూనియన్ నాయకులు శంకర్, వీఆర్‌ఏ సంఘం నాయకులు పాల్గొన్నారు.










