Sep 20,2022 21:37

కనీస వేతనాల కోసం ఐక్య పోరాటం
కదం తొక్కిన కార్మికులు
కలెక్టరేట్‌ వద్ద భారీ ధర్నా
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి

కనీస వేతనం రూ.26వేలు సాధించుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ముఖ్యంగా పోరాటాలు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అజరు కుమార్‌ పిలుపునిచ్చారు. చిత్తూరు కలెక్టరేట్‌ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా జరిగింది. ఇందులో జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం భోజనం, విఓఏ, గ్రామ పంచాయతీ, పవర్లూమ్‌, గ్రావిట వర్కర్స్‌, వైద్యవిధాన పరిషత్‌ కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. వీరి రాకతో కలెక్టరేట్‌ పరిసర ప్రాంతాలు క్రిక్కిరిసాయి. కనీస వేతనాలు ఇవ్వాలంటూ వారు చేసిన నినాదాలతో కలెక్టరేట్‌ ప్రాంతం దద్దరిల్లింది. కార్మికుల ధర్నాలో అజరు కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కనీసవేతనాల సలహా బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని, 60 షెడ్యూల్డ్‌ రంగాల్లోని కార్మికుల కనీస వేతనాలను వెంటనే సవరించి రూ.26వేలు వేతనంగా నిర్ణయించాలని ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేశారు. గత 15 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలు వేతన సవరణ చేయనందు వల్ల కార్మికులు అర్ధాకలితో బతుకుతున్నారని స్కీం వర్కర్స్‌ను కార్మికులుగా గుర్తించి కనీసవేతనం, గ్రాట్యుటీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్సు చేయాలని కోరారు. భవిష్యత్‌ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.చైతన్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు, వైద్య విధాన పరిషత్‌ హాస్పిటల్స్‌ పారిశుద్ధ్య కార్మికులకు బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని, ఎన్‌.సి.డి. సర్వేలు చేసిన ఆశాలకు చెల్లించాల్సిన పారితోషకం ఇచ్చేందుకు కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గంగరాజు అధ్యక్షత వహించారు. ధర్నాలో చల్లా వెంకటయ్య, సురేంద్రన్‌, భువనేశ్వరి, శ్యామల, అనిత, వరలక్ష్మి, గిరిధర్‌ గుప్తా, సావిత్రి,అనూరాధ, గోవిందప్ప, రామకష్ణ, సురేష్‌, దినేష్‌, నళిని, ప్రియ, పెరుమాళ్‌, జగదీష్‌ తదితర వివిధ యూనియన్ల నాయకులు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలి: ధనలక్ష్మి
పుంగనూరు: ఆశా వర్కర్లకు చట్టబద్ధమైన సౌకర్యాలు అన్ని కల్పించాలని, సంక్షేమ పథకాలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని పుంగనూరు సిఐటియు నాయకురాలు ధనలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండలంలోని ముడిబాపనపల్లి పీహెచ్సీలోని ఆశావర్కర్లు మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టి వైద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ ఆశాలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని చట్టబద్ధమైన సౌకర్యాన్ని కల్పించాలని గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ తదితర సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు తప్పవని అన్నారు.