కనీస వేతనాల కోసం
20న కలెక్టరేట్ ఎదుట ధర్నా
ప్రజాశక్తి- చౌడేపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని, కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ఎదుట ఈనెల 20వ తేదీన జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు అధ్యక్షులు వాడ గంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.చైతన్య పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో సిఐటియు మండలస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ అన్ని రకాల కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకపోవడం దుర్మార్గం అన్నారు. ఎన్నికల ముందు కార్మికులకు అనేక రకాల హామీలు ఇచ్చి ఇప్పుడు మర్చిపోవడం ఏరు దాటే వరకు మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా ఉందని విమర్శించారు. కార్మిక చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వంకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతూ ఇక్కడ మాత్రం కార్మికులపై సానుభూతి చూపడం సిగ్గుచేటు అని అన్నారు. స్కీంవర్కర్లు అంగన్వాడీ, ఆశ, విఓఏ, మధ్యాహ్నం భోజనం కార్మికులు ప్రభుత్వంకు అనేక రకాలుగా సేవలు అందిస్తున్న వీరిపై కక్షసాధింపు చర్యలు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నెలకు రూ.26వేల కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులకు పనిభారం పెరుగుతున్న కార్మికులను పెంచకపోవడం దారుణమన్నారు. ఈసమస్యలు పరిష్కరించాలని 20న జరిగే కలెక్టరేట్ ఎదుట ధర్నాకు కార్మికులు అధికసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రామకష్ణ, రమణలతో పాటు కార్మికులు పాల్గొన్నారు.










