Jun 14,2022 22:18

కనెక్షన్‌ లేకున్నా... వేలల్లో బిల్లులు..
కార్పొరేషన్‌లో 'ఆన్‌లైన్‌' గందరగోళం
నీళ్ల కనెక్షన్‌ లేని వారికీ నోటీసులు
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌

కులాయి కనెక్షన్‌ ఉన్న వారికి బిల్లు రావడం సహజమే... అయితే నీటి కులాయి కనెక్షన్‌ లేకున్నా వేలకువేలు బిల్లులు కట్టాలంటూ నగర పాలక సంస్థ నుండీ నోటీసులు వస్తున్నాయి. 'మాకు కులాయి కనెక్షనే లేదు బాబోరు.. బిల్లులు కట్టమంటే ఎలా' అంటూ చిత్తూరు నగరంలో కొలాయి కనెక్షన్‌ లేని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు నగర పాలక పరిధిలో 50 డివిజన్లలో 80వేలకు పైగా అధికారికంగా కొలాయి కనెక్షన్లు ఉన్నాయి. అనధికారికంగా మరో 1000 నుండీ 1500 వరకు ఉంటాయని అంచనా... ఆరు నెలలకో సారి నగర పాలక సంస్థకు కొలాయి కనెక్షన్‌ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం ఇంటింటికీ కొలాయి పేరుతో ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్‌ తప్పని సరి చేస్తూ మురికి వాడలు, తెల్లరేషన్‌కార్డులు కలిగిన వారికి రూ. 200కే కొలాయి కనెక్షన్‌ ఇచ్చింది. అప్పట్లో ప్రతి ఇంటికీ నీటి కొలాయి తప్పని సరి చేయడంతో వీధిల్లో ఉన్న కొలాయిలను పూర్తిగా తొలగించారు. వీధుల్లో కొలాయిలు తొలగించడంపై ప్రజల నుండీ తీవ్ర వ్యతిరేకత వచ్చినా రెండు వందలకే కనెక్షన్లు ఇస్తున్నట్లు మభ్యపెట్టి వీధుల్లోని కొలాయిలను తొలగించారు. ప్రస్తుతం చిత్తూరు కార్పొరేషన్‌ పరిధిలో నామమాత్రంగానే వీధి కొలాయిలున్నాయి. ఇదిలా ఉంటే నీటి కొలాయి కనెక్షన్‌ కోసం రూ. 200 చెల్లించలేని వారు వీధి కొలాయిలనే ఆశ్రయించాల్సి వస్తోంది. ఇంటి నుండీ ఎంత దూరం ఉన్నా అక్కడి నుండీ బిందెల్లో నీరు తెచ్చుకుంటున్నారు. మురికివాడల్లో నీటి కనెక్షన్లు లేని వారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఒకటి రెండు కొలాయిల వద్ద కుస్తీలుపడుతూ నీటిని పట్టుకోవాల్సి వస్తోంది. వీటిని కూడా తొలగించి పూర్తిగా నీటి మీటర్లుఏర్పాటు చేసేందుకు నగర పాలక సంస్థ కసరత్తు చేస్తోంది. నీటి మీటర్లు ఏర్పాటు చేస్తే ప్రతి ఇంటికీ కనెక్షన్‌ తప్పని సరిగా తీసుకోకతప్పదు.
కనెక్షన్‌ లేకున్నా బిల్లులు
చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలో నీటి కనెక్షన్‌ లేకున్నా వేలకువేలు నీటి బిల్లులు వస్తున్నాయి. నీటి కనెక్షన్లు బిల్లులు పూర్తిగా ఆన్‌లైన్‌ చేయడంతో దాదాపు 700 మంది తమకు కనెక్షన్లు లేకున్నా బిల్లులు వస్తున్నట్లు లబోదిబోమంటున్నారు. అనేక సార్లు తమకు నీటి కనెక్షన్‌ లేదని ఫిర్యాదు చేసినా ఆన్‌లైన్‌లో ఏమి చేయలేమంటూ నగర పాలక సంస్థ నీటి సరఫరా విభాగం అధికారులు చేతులెత్తేస్తున్నారు. కొత్తగా కనెక్షన్‌ తీసుకోవాలనుకునే వారికి ఇబ్బందిగా మారుతోంది. ఇప్పటి వరకు వారి పేర్లపై ఉన్న బిల్లులు పూర్తిగా చెల్లిస్తేనే కనెక్షన్‌ మంజురు చేయడం సాధ్యం అవుతుందని అధికారులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. ఇలా కొలాయి కనెక్షన్‌ లేకున్నా తమ పేర్లపై వస్తున్న బిల్లులు చెల్లించలేక కొత్త కనెక్షన్‌ పొందలేక వీధి, ప్రయివేటు నీటి ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోంది.
కనెక్షన్‌నే లేదు...
బిల్లు 19 వేలు వచ్చింది : చల్లయ్య
వళ్ళియప్పనగర్‌కు చెందిన చల్లయ్యకు మున్సిపల్‌ కొలాయి కనెక్షన్‌ లేదు. అయితే ఇతడి పేరుపై నీటి కనెక్షన్‌ ఉన్నట్లు నగర పాలక నీటి సరఫరా విభాగం నుండీ రూ. 19,080 చెల్లించాలంటూ నోటీసు జారీ చేశారు. తనకు కనెక్షన్‌ లేదంటూ ఇప్పటి వరకు వంద సార్లు నగర పాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేసినా ఆన్‌లైన్‌ బిల్లులు ఏమి చేయలేమంటూ అధికారులు చేతులెత్తేయడంతో పది సంవత్సరాలుగా నీటి కనెక్షన్‌ పొందలేక ఇబ్బందులు పడుతున్నాడు. నగర పాలక సంస్థ నిర్వహించే స్పందన, వార్డు సచివాలయంలో ఫిర్యాదు చేసినా ఏమీ చేయలేమంటూ సమాధానమే వస్తోందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కనెక్షన్‌ లేకున్నా బిల్లులు రావడమేమిటని ప్రశ్నిస్తున్నాడు.