Apr 29,2023 21:02

జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి
ప్రజాశక్తి - భీమవరం
కంటి వెలుగు స్క్రీనింగ్‌ పరీక్షలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ మూడో విడత కంటి వెలుగు కార్యక్రమంపై వైద్య శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 60 ఏళ్ల వయసు పైబడిన 88,638 మందికి మూడో విడత కంటి వెలుగు కార్యక్రమం కింద స్క్రీనింగ్‌ పరీక్షలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇప్పటివరకూ 22,248 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2,01,578 మందికి కంటి పరీక్షలు చేయాలని లక్ష్యం తీసుకోగా తొలి రెండు విడతల్లో 1,12,940 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు పూర్తి చేసి, అవసరమైన 34,064 మందికి కంటి అద్దాలు అందజేయడం జరిగిందన్నారు. అలాగే 3,558 మందికి శస్త్రచకిత్సలు చేసినట్లు తెలిపారు. నరసాపురం, పాలకొల్లు మండలాల్లో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్సలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో కంటి వెలుగు డిపిఎం డాక్టర్‌ ఎస్‌.చందన ప్రియ, తణుకు హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ శివప్రసాద్‌, భీమవరం, తణుకు పిఎంఒలు ఎంఆర్‌కె.రాజు, రమేష్‌ పాల్గొన్నారు.