Oct 15,2022 21:46

కంపోస్ట్‌ విధానాన్ని అమలు చేయాలి: కమిషనర్‌
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
నగరంలో ఎక్కువ మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసే వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాల్లో ఆన్‌సైట్‌ కంపోస్ట్‌ విధానం అమలు చేయాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ చెప్పారు. శనివారం సాయంత్రం నగరపాలక సమావేశ మందిరంలో కమిషనర్‌ నగరంలో ఎక్కువ తడి,పొడి వ్యర్థాలను ఉత్పత్తి చేసే హౌటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌ తదితర సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ జాతీయ హరిత ట్రిబ్యునల్‌ మార్గదర్శకాలు, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ -2016 నిబంధనల మేరకు ఎక్కువ మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తిచేసే సంస్థలు, వ్యాపార సముదాయాలు, సొంతంగా కంపోస్ట్‌ తయారీ విధానాన్ని చేపట్టాలన్నారు. తడి, పొడి వ్యర్థాలను వేరువేరుగా సేకరించి హోం కంపోస్టు విధానంలో వ్యర్ధాలను ఎరువుగా మార్చాలన్నారు. చిన్న హౌటళ్లు, దుకాణాలు బందాలుగా ఏర్పడి హౌమ్‌ కంపోస్టింగ్‌ విధానాన్ని అమలు చేయడం ద్వారా వ్యర్ధాలను తగ్గించాలన్నారు. కంపోస్టింగ్‌ విధానంపై శిక్షణ ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ని ఉపయోగించరాదని స్పష్టం చేశారు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌ మార్గదర్శకాలను పాటించేందుకు, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ -2016 నిబంధనలు అమలు చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. సమావేశంలో సహాయ కమిషనర్‌ గోవర్థన్‌, ఎంహెచ్వో అనిల్‌ కుమార్‌, శానిటరీ ఇన్స్పెక్టర్‌ చిన్నయ్య, హౌటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.