అనంతపురం:జిల్లాలో జరుగుతున్న జగనన్న హౌసింగ్ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అవసరమైన మేరకు నాణ్యమైన కంకరను సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ సూచించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని క్వారీ, కంకర యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ పేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న హౌసింగ్ కాలనీలో అవసరమేరకు ఉన్న 20 ఎంఎం, 12 ఎంఎం, 6 ఎంఎం రాయితోపాటు డస్టును సరఫరా చేసే క్రమంలో ఎలాంటి లోటుపాటు ఇవ్వకుండా సకాలంలో సరఫరా చేయాలని సూచించారు. ఇదివరకు సరఫరా చేసిన వాటికి బిల్లులను సత్వరమే చెల్లిస్తామని చెప్పారు. సమావేశంలో పాల్గొన్న రాయదుర్గం, తాడిపత్రి, బొమ్మనహాల్, అనంతపురం, గుత్తి తదితర కంకర యాజమాన్యం వారు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకొచ్చారు. వీటి పరిష్కారానికి తనవంతు కషి చేస్తామని జెసి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశులు, ఏడీ నాగయ్య, ఏడీ విజిలెన్స్ విజయలక్ష్మి, అసిస్టెంట్ జియాలాజిస్ట్ రామకష్ణ ప్రసాద్, క్వారీ, కంకర యాజమాన్యాల ప్రతినిధులు వెంకట నాయుడు, అశోక్, రాఘవేంద్ర, విశ్వనాథ్ పాల్గొన్నారు.










