తాడిపత్రి : మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తాడిపత్రి మున్సిపల్ కమిషనర్‌పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేంత వరకూ నిరసనలు కొనసాగిస్తామని మున్సిపల్ ఛైర్మన్ జెసి ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ వైఖరిని నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద జెసితోపాటు కౌన్సిలర్లు చేపట్టిన నిరసన బుధవారం మూడో రోజుకు చేరుకుంది. ఈయన దీక్షకు పట్టణంలోని పలు ప్రజా సంఘాల నాయకులు, ఆర్‌ఎంపి సంఘం నాయకులు, నాయీబ్రాహ్మణ మహిళలు, స్వర్ణకారులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. తర్వాత ప్రభాకర్‌రెడ్డి సోదరుడు జెసి దివాకర్‌రెడ్డి కూడా దీక్షా శిబిరాన్ని సందర్శించి చర్చించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డితో చాలాసేపు సమాలోచనలు చేశారు. ముఖ్యంగా ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. అనంతరం జెసి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారులు తమ వద్దకు వచ్చి పాలకవర్గ 15 డిమాండ్లను పరిష్కరించేంత వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా స్థానిక కమిషనర్ మార్కెట్ వేలంపాటలు నిర్వహించకుండా పురపాలక సంఘానికి నష్టం తెచ్చారన్నారు. కౌన్సిల్ ఆమోదం లేని పనులు చేపట్టిన పురపాలక సిబ్బందిని తొలగించాలని, అధికార పార్టీ వారికి వత్తాసు పలుకుతూ ఉన్న కమిషనర్ వైఖరి మార్చుకుని అభివృద్ధికి సహకరించాలన్నారు. కౌన్సిల్ తీర్మానాన్ని ధిక్కరిస్తూ సీనియర్ అసిస్టెంట్‌ను డిప్యుటేషన్‌పై తీసుకురావడం, పట్టణంలో అండర్ గ్రౌండ్ వ్యవస్థకు సంబంధించి పనులు చేపట్టకపోవడం, కమిషనర్ మున్సిపల్ చట్టం రూల్ నెంబర్.3 అనుసరించకపోవడం, మున్సిపల్ చట్టంలో పొందుపరిచిన రూల్స్ విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్న కమిషనర్‌పై జిల్లా అధికారులు చర్యలు చేపట్టకపోవడం, పురపాలక సంఘంలో డీజిల్ అన్యాక్రాంతం చేస్తున్న అధికారులపై కమిషనర్ చర్యలు చేపట్టకపోవడం వంటి సమస్యలు పరిష్కరించేంత వరకూ నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు.










