- - కాపు అసమర్థతపై కాలవ ఎద్దేవా
- జాతీయ రహదారిపై 8వ సెల్ఫీ
ప్రజాశక్తి-రాయదుర్గం : రాయదుర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి కాపు రామచంద్రారెడ్డి తనను ఆడిపోసుకోవడం తప్ప ఏనాడూ ఈప్రాంత అభివృద్ధిపై శ్రద్ధ పెట్టలేదని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. తన 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్ లో భాగంగా టీడీపీ హయాంలో నిర్మించిన జాతీయ రహదారిపై సోమవారం ఆయన 8వ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. అత్యంత మారుమూలన ఉన్న రాయదుర్గాన్ని జాతీయ రహదారుల చిత్రపటంలో నిలిపామన్నారు. తన పట్టుదల, చంద్రబాబు నాయుడి ఆశీస్సుల వల్ల హనగల్ నుండి అనంతపురం వరకు ఎన్ హెచ్-544 డిడి పేరుతో రూ.549 కోట్లతో రహదారి నిర్మాణం జరిగిందన్నారు. బళ్లారి నుండి ఉరవకొండ మీదుగా అనంతపురం దాకా జాతీయ రహదారి ఉన్నందున సమీపంలో మరొకటి సాధ్యపడదని కేంద్రం మొదట్లో ఈ ప్రతిపాదనను ఒప్పుకోలేదన్నారు. అయితే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఒప్పించి ఈ రహదారిని చంద్రబాబు నాయుడు మంజూరు చేయించారన్నారు. రాయదుర్గం నుండి గార్మెంట్స్ ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేయడానికి ప్రస్తుతం ఇది ఎంతో ఉపయోగపడుతొందన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాపు రామచంద్రారెడ్డి ప్రజలకు పనికొచ్చే ఇట్లాంటి శాశ్వత పనులు ఎందుకు చేయలేదని సూటిగా ప్రశ్నించారు. అభివృద్ధిలో పోటీపడడం చేతకాక సహనం కోల్పోతున్న 'కాపు' పశుభాషలో తనను విమర్శిస్తుంటాడని దుయ్యబట్టారు. ప్రభుత్వ విప్ హోదాలో ఉన్న అతను ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. 'కాపు' అసమర్థత వల్లే రాయదుర్గం అభివృద్దిలో వెనుకబడి ఉందన్నారు. ఇప్పటికైనా అతనికి దమ్ముంటే ఇట్లాంటి అభివృద్ధి పనులను సాధించాలని సవాలు విసిరారు.










