అనంతపురం కలెక్టరేట్ : జిల్లాలో వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద 486 మంది లబ్ధిదారులకు రు.3.61 కోట్ల ఆర్థిక సహాయాన్ని పెళ్లి కుమార్తె తల్లులు ఖాతాలకు జమ చేసినట్లు కలెక్టర్ ఎమ్.గౌతమి పేర్కొన్నారు. కళ్యాణమస్తు, షాదీతోఫా పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని శుక్రవారం నాడు కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా కింద పేద కుటుంబాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులు ఆడపిల్లలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని చెప్పారు. జిల్లాలో ఈ పథకం ద్వారా కులాంతర వివాహాలు 71 మంది, ఒకే కులంలో వివాహం చేసుకున్నవారు 405 మంది ఉన్నారన్నారు. మొత్తం 486 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని చెప్పారు. అనంతరం లబ్ధిదారులకు మెగా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, రాష్ట్ర రజక కార్పొరేషన్ ఛైర్మన్ మీసాల రంగన్న, ఏపీఎస్ ఆర్టీసీ రీజియన్ ఛైర్ పర్సన్ మంజుల, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఉమాదేవి, నగర మేయర్ మహమ్మద్ వసీం, డీఆర్డీఏ పీడీ నరసింహా రెడ్డి, సోషల్ వెల్ఫేర్ డిడి విశ్వమోహన్ రెడ్డి,డిటీడబ్ల్యూఓ అన్నాదొరై, పాల్గొన్నారు.లి










