May 09,2023 21:45

కలుషితనీరు తాగి అస్వస్థతకు గురైన ప్రాంతంలో పర్యటించి, బాధితులతో మాట్లాడుతున్న అధికారులు

    గుమ్మఘట్ట : మండల పరిధిలోని బేలోడు గ్రామంలో కలుషిత నీరు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి... బేలోడు గ్రామంలో పంచాయతీ కొళాయిల ద్వారా సరఫరా అవుతోంది. ఇటీవల సరఫరా అయిన ఈ నీటిని గ్రామస్తులు తాగారు. సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం గ్రామానికి చెందిన రంగప్ప, మారెక్క, రామప్ప, తిప్పేస్వామి, లక్ష్మీదేవి, మాణిక్యమ్మ, లావణ్య, భాస్కర్‌, భరత్‌లు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాగునీటిని తాగడం వల్ల అస్వస్థతకు గురైనట్లు వారు తెలిపారు. వెంటనే వారిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేదని తెలిపారు.
గ్రామంలో అధికారుల పర్యటన
కలుషితనీరు తాగి అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న అధికారులు బేలోడు గ్రామంలో పర్యటించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు నీటిని పరీక్ష నిమిత్తం లాబ్‌కు పంపారు. రాయదుర్గం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆర్డీవో నిశాంత్‌ రెడ్డి, తహశీల్దార్‌ వేణుగోపాల్‌, వైద్యాధికారులు డాక్టర్‌ రమేష్‌, మురళి, ఎస్‌ఐ సునీతలు పరామర్శించారు. అస్వస్థతకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే గ్రామంలో కొళాయి పైపులు, ట్యాంకుల వద్ద బ్లీచింగ్‌ పౌడర్‌ చలించే ఏర్పాటు చేశారు.
ట్యాంకులను శుభ్రం చేయించాం
గ్రామ సర్పంచి ఉమేష్‌ రెడ్డి

గ్రామంలో సీజనల్‌ వ్యాధుల వల్ల జ్వరం, వాంతులు విరోచనాలు అయ్యాయని, అస్వస్థతకు నీరు కారణం కాదని సర్పంచి ఉమేష్‌రెడ్డి తెలిపారు. మే 1వ తేదీన గ్రామానికి సరఫరా చేసే ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను శుభ్రం చేయించామన్నారు.
కాపు పరామర్శ
రాయదుర్గం :
గుమ్మగట్ట మండలం బేలోడు గ్రామంలో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురైన రాయదుర్గం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర ప్రభుత్వ విప్‌, రాయదుర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి మంగళవారం పరామర్శించారు. జరిగిన పరిణామంపై వారితో అడిగి తెలుసుకున్నారు. బాధితులందరికీ మెరుగైన వైద్యం అందేలా చికిత్సలు అందించాలని ఆసుపత్రి సూపరిండెంట్‌ మాధవిని ఆదేశించారు. అనంతరం ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున రూ.13 వేల సాయాన్ని అందించారు.
బాధాకరమైన ఘటన : కాలవ
కలుషిత నీటితో బేలోడు గ్రామస్తులు అస్వస్థతకు గురికావడం బాధాకరమైన ఘటన అని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. తాగునీరు కలుషితమై వాంతులు, విరేచనాలతో చికిత్స పొందుతున్న వారిని ఆసుపత్రిలో పరామర్శించారు. కలుషిత నీటి ద్వారానే తాము అనారోగ్యానికి గురయ్యామని పలువురు బాధితులు ఆయన ఎదుట వాపోయారు. స్థానిక సర్పంచి, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని కాలవ పేర్కొన్నారు. మూడు నెలలుగా బేలోడు గ్రామంలో తాగు నీరు సక్రమంగా రావడం లేదన్నారు. జిల్లా కలెక్టర్‌ స్పందించి బేలోడు గ్రామాన్ని వెంటనే సందర్శించాలన్నారు. శుద్ధమైన మంచి నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తాగునీటి కలుషితానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట టిడిపి రాయదుర్గం పట్టణ అధ్యక్షుడు పసుపులేటి నాగరాజు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి కాలవ సన్నన్న, బేలోడు సంజీవ, సర్పంచి నాగరాజు, రోశయ్య, ఏకాంతప్ప కరెన్న, వేణు, ఆశోక్‌, సత్తి, కష్ణ, ప్రహ్లాద ఉన్నారు.