May 11,2023 22:04

అనంతపురం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బేలోడు బాధితులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమి

         గుమ్మగట్ట : మండల పరిధిలోని బేలోడు గ్రామంలో నాలుగు రోజుల క్రితం కలుషిత నీరు తాగి ఎనిమిది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కరియమ్మ(70) అనే మహిళ గురువారం నాడు మృతి చెందారు. బేలోడు గ్రామంలో కలుషితం నీరు, ఆహారం వల్ల అస్వస్థతకు గురైన వారు ఇంకా పలు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. రాయదుర్గంలో ముగ్గురు ఉండగా నలుగురిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.
బేలోడు బాధితులకు కలెక్టర్‌ పరామర్శ
అనంతపురం కలెక్టరేట్‌ : వాంతులు, విరేచనాలకు గురై స్థానిక అనంతపురం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుమ్మఘట్ట మండలం బేలోడు గ్రామస్తులను గురువారం సాయంత్రం కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి పరామర్శించారు. ఏఎంసీ విభాగంలో చికిత్స పొందుతున్న గంగమ్మ, మారెక్క, లక్ష్మీదేవి, పీడియాట్రిక్‌ వార్డులో చికిత్స పొందుతున్న త్రిష ,నితిన్‌ల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఐదుగురి ఆరోగ్యం నిలకడగా ఉందని డీఎంహెచ్‌ఒ వీరబ్బాయి, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ యుగంధర్‌లు కలెక్టర్‌కు తెలిపారు. బాధితులను నిరంతరం పర్యవేక్షణలో ఉంచాలని, పూర్తిగా కోలుకునేంత వరకు ఆసుపత్రిలో చికిత్స అందించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.