'కల్తీ' కల్లోలం
ప్రజాఆరోగ్యంపై ప్రభావం
నిద్రావస్థలో కల్తీ నిరోధకశాఖ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
ఆహార పదార్థలు సరుకులు, పానీయాలు ఇలా అన్నీ కల్తీమయమే.. కల్తీ పదార్ధాలు కంటి ముందే కనిపిస్తున్నా పట్టించుకొనే నాధుడే కరువైయ్యారు. కొందరు అక్రమార్కులు కల్తీ నిరోధకశాఖ కళ్ళుగప్పి యథేచ్ఛగా ఆహారపదార్ధలను మొదలుకొని ఆహారోత్పత్తుల వరకు అన్నీ కల్తీలకు పాల్పడుతున్నారు. ఇటీవల వంటనూనెల దుకాణాలపై అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. పెద్దసంఖ్యలో వంటనూనెల్లో కల్తీలు జరుగుతున్నట్లు గుర్తిచంచారు. ఇదే తరహాల్లో అన్ని రకాల తినుబండాలు కల్తీ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు తినే తినుబండారాలు, చికెన్ పకోడాలు, న్యూడిల్స్, గోబీ మంజూరీలో రంగు, రుచి కోసం అనవసరంగా హానికరమైన రంగులను ఉపయోగిస్తున్నారు. ఇవి తినడం వల్ల పిల్లలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని వైద్యలు హెచ్చరిస్తున్నారు.
బహిరంగ మార్కెట్‌లోనూ యథేచ్ఛగా కల్తీసరుకులు విక్రయిస్తున్నా కల్తీ నిరోధకశాఖ (పుడ్ కంట్రోల్‌బోర్డు) అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఒక్క చిత్తూరు నగరంలోనే సందుసందుకూ చికెన్ పకోడా దుకాణాలు రోడ్లుపైనే అమ్మకాలు సాగిస్తున్నాయి. స్వీట్స్, బేకరిలు, చికెన్ బిర్యానీ సెంటర్లు వందల సంఖ్యలో వెలశాయి. ఇలా కొత్తకొత్తగా రోడ్లుపైనే అమ్మకాలు సాగిస్తున్న దుకాణాలు ఆహారభద్రతా నియమాలు ఏమాత్రం పాటించడం లేదు. వినియోగదార్లను ఆకర్షించేందుకు హానికరమైన రసాయనాలు కలుపుతున్నారు. సహజ సిద్ధమైన కారంపోడి, పసుపు, ఉప్పు వంటి వస్తువులను మాత్రమే వాడాల్సి ఉండగా రుచి కోసం హానికరమైన వాటిని ఉపయోగిస్తూ ప్రజాఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. నగరపాలక సంస్థ నుండీ ట్రేడ్ లైసెన్స్ పొందకుండా అనేక మంది రోడ్లుపైనే విక్రయాలు సాగిస్తున్నారు.
ముఖ్యంగా పాస్ట్‌పుడ్ పేరుతో సాగిస్తున్న విక్రయాల్లో హానికరమైన రసాయనాలు అధికంగా ఉపయోగిస్తున్నారు. పాస్ట్‌పుడ్ క్రమంగా తీసుకొనేవారిలో ఇందులో ఉపయోగించే రసాయనాల ప్రభావం వల్ల ఊబకాయం, జీర్ణాకోశ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా కాలేయ సమస్యలు వచ్చే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఆహారపదార్థల విక్రయాలపై కల్తీ నిరోధకశాఖ, నగర పాలక సంస్థ ప్రజాఆరోగ్యంశాఖ అధికారులు తనిఖీ చేసి కల్తీ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలి అయితే సిబ్బంది కొరత, జిల్లాల విభజన పేరుతో పట్టించుకోవడం మానేశారు. దీంతో కల్తీరాయులు చెలరేగిపోతున్నారు. ఎలాంటి ఆహారభదత్రా నియమాలు పాటించకుండా అమ్మకాలను సాగిస్తూ ప్రజాఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు. విద్యార్థులు, చిన్న పిల్లలు తినే న్యూడిల్స్, కుర్‌కురే ప్యాకెట్లు, బహిరంగా విక్రయిస్తున్నారు. అంతేకాకుండా సమోసాలు ఇతర తినుబండాలు ఏమాత్రం ఆహార భద్రతా నియమాలు పాటిండం లేదనే విమర్శలున్నాయి. కల్తీ నిరోధకశాఖ అధికారులు దాడులు చేసి సురక్షితమైన ఆహార పదార్థలు విక్రయించేలా చర్యలు తీసుకోవడంతో పాటు కల్తీ ఆహార పదార్థలు విక్రయించేవారిపై చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.
కల్తీ వస్తువుల విక్రయిస్తే చర్యలు తప్పవు
- ప్రభాకర్‌రావు, పుడ్‌ఇన్‌స్ప్టెర్
కల్తీని తగ్గించేందుకు కల్తీ నిరోధకశాఖ దాడులు నిర్వహించడం జరుగుతోంది. మోసానికి గురైన ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తేనే కేసు నమోదుచేసి దుకాణాన్ని సీజ్‌చేసే అవకాశముంది. దాడుల్లో కల్తీ జరిగిన్నట్లు గుర్తిసే వాటి శ్యాపిల్స్ స్వీకరించి టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపాలి. రిపోర్డు అందిన తరువాతే చర్యలు తీసుకొనే అవకాశముంటుంది. జరిమానా వేయడంతో పాటు జైలుశిక్ష విధించవచ్చు. ముఖ్యంగా ప్రజలు ఆహార భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉండాలి. సీల్ చేసిన వస్తువులపై ఎక్స్‌ఫైర్ డేట్ చూసి కొనుగోలు చేయాలి.










