Sep 18,2022 21:43

కల్పవృక్ష వాహనంపై వినాయకుడు
ప్రజాశక్తి- ఐరాల

కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న స్వామివారి ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా ఆదివారం వైభవంగా కల్పవక్ష వాహనంపై సిద్ధిబుద్ధి సమేతుడైన శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఊరేగుతూ భక్తులను అలరించారు. ఈ సందర్భంగా ఈవో పూర్ణచంద్రరావు, ఆలయ ట్రస్ట్‌బోర్డ్‌ చైర్మన్‌ మోహన్‌రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం కల్పవక్ష వాహనానికి ఆలయ వరుస ఉభయదారులైన ఆలయ కార్యనిర్వహాణాధికారి, ఆలయ ట్రస్టుబోర్లు చైర్మన్‌, అర్చకులు, సిబ్బంది, ఉభయదారులుగా వ్యవహరించారు. ప్రతి ఏడాది స్వామివారికి కల్పవక్ష వాహన సేవలను అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. అలాగే ఈ ఆదివారం ఉదయం వేకువజామున నాలుగు గంటలకు స్వామివారి మూలవిరాట్‌కు వివిధ రకాల పరిమళ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చందన అలంకరణ సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి కేరళ వాయిద్యం చెక్కభజనలు లంబాడి నత్య ప్రదర్శనలు వివిధ రకాల సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో ఎంవి.సురేష్‌బాబు, ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ మోహన్‌ రెడ్డి, ఈఈ వెంకట నారాయణ, ఏసీ కస్తూరి, ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, రవీంద్రబాబు, ఎస్పీ కృష్ణారెడ్డి, హేమమాలిని, హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, శ్రీనివాసులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు రమేష, బాబు, ఆలయ ప్రధాన ఇన్‌ఛార్జి ధర్మేశ్వర గురుకుల్‌, రాఘవేంద్ర స్వామి, గణేష్‌ గురుకుల్‌, సోమశేఖర గురుకుల్‌, హరీష్‌ స్వామి, శీనివాసాచార్యులు, ఉన్నికష్ణ గురుకుల్‌, తదితరులు పాల్గొన్నారు.
75వేల మంది భక్తులకు ప్రత్యేక అన్నదానం
కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానంలో ఆగస్టు 31నుంచి సెప్టెంబర్‌ 20వతేదీ వరకు నిర్వహిస్తున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా ఆలయ ఈవో ఎంవి.సురేష్‌ బాబు, ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 75వేల మంది భక్తులకు అన్నదానం చేసినట్లు తెలిపారు.
ఆలయ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా బ్రహ్మోత్సవాల కాలంలో భక్తులకు తనవంతు సేవలు అందించాలని ఉద్దేశ్యంతో కార్య నిర్వాహకులు, ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ బాలకష్ణారెడ్డి, శ్రీరాములురెడ్డి, జగన్నాధరెడ్డి, చిత్తూరు సింధు టవర్‌ అతినేత సింధు సరస్వతి, మోహన్‌రెడ్డి, రత్నంరెడ్డి, సురేష్‌రెడ్డి, భక్తవ వత్సలంరెడ్డి, సుధాకర్‌రెడ్డిలు 10మంది సభ్యులుగా ఏర్పడి 2008 సంవత్సరం అప్పటి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌ వి.వెంకటేశ్వరావు ఆదేశాలు మేరకు డిడి ఎస్‌ నెంబరు: హెచ్‌2/25007/2008 ఆర్డర్‌ ప్రకారం గత 14 సంవత్సరాలుగా ప్రత్యేక అన్నదాన ట్రస్టు ద్వారా ప్రతి ఏటా కాణిపాకం దేవస్థానంలో 21 రోజులు పాటు జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భక్తులకు ప్రత్యేక అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
అన్నదానానికి విశేష స్పందన: ఈవో సురేష్‌బాబు
కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక అన్నదానానికి విశేష స్పందన లభించిందని ఆలయ ఈవో సురేష్‌ బాబు తెలిపారు. అలాగే దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిరోజు నిర్వహిస్తున్న స్వామివారి నిత్య అన్నదాన పథకానికి దాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి కూరగాయలు, బియ్యం, నగదు వంటి విరాళంగా ఇచి సహకరించారని తెలిపారు.