Jul 10,2023 18:43

సంఘం రాష్ట్ర అధ్యక్షులు జుత్తిగ నరసింహమూర్తి
ప్రజాశక్తి - భీమవరం
కల్లుగీత కార్మికులకు వైసిపి ప్రభుత్వం నాలుగేళ్లలో ఏంచేసిందో శ్వేతపత్రం ప్రకటించాలని కల్లు గీత కార్మిక సంఘం డిమాండ్‌ చేసింది. డివిజన్‌ కల్లుగీత కార్మికుల విస్తృత సమావేశం కడలి పాండు అధ్యక్షతన సోమవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు జుత్తిగ నరసింహమూర్తి మాట్లాడుతూ ఆనాడు పాదయాత్రలో కల్లుగీత కార్మికులను ఆలింగనం చేసుకుని ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వం చీప్‌ లిక్కర్‌ను విచ్చలవిడిగా అమ్మేస్తూ 80 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న కల్లుగీత వృత్తిని దారుణంగా దెబ్బతీసిందని విమర్శించారు. ప్రాణాలకు తెగించి వృత్తి చేస్తున్న గీతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏం చేసిందో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించి తొమ్మిది నెలలు కావస్తున్నా ఇప్పటికీ స్పష్టమైన ఆదేశాలు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాలు గీత వృత్తిని అన్నివిధాలా ఆదుకుంటుంటే, మన రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం విధానాల వల్ల కార్మికులు బతకలేక నగరాలకు, పొరుగు దేశాలకు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గీత కార్పొరేషన్‌కు తక్షణం రూ.5 వేల కోట్లు కేటాయించి, గీత కార్మికుల సంక్షేమం కోసం పని చేయించాలన్నారు. గీతవృత్తి ఆధునికీకరణకు నిపుణులతో అధ్యయన కమిటీ వేయాలని, ప్రమాదాలను నివారించడానికి సేఫ్టీ మోకులు ఇవ్వాలని, నీరా, తాటి ఉత్పత్తుల పరిశ్రమలు పెట్టాలని కోరారు. కల్లుకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వంపై ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో జిల్లా సహాయక కార్యదర్శి బొక్కా చంటి, చింతపల్లి వీరాస్వామి, కోమిటి సత్యనారాయణ, తుంగ సాయిబాబు, కాగిత రాధాకృష్ణ, దొంగ సత్యనారాయణ, వీరవల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.