తాడిపత్రి రూరల్ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత వారం తేలికపాటి వర్షాలు పడ్డాయి. గత రెండు రోజులుగానూ అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పలు అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ఇందులో ప్రస్తుతం కళ్లకలక వైరస్ జనాన్ని కలవర పెడుతోంది. ఈ సీజన్‌లో ప్రస్తుతం ఈ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీని ప్రభావం చిన్నారులపై ఎక్కువగా పడుతోంది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటీవలి కాలంలో కళ్లకలక కేసులు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వర్షాల కారణంగా కండ్లకలక వంటి కంటి ఇన్ఫెక్షన్‌లు రావడం సహజమే అయినా, ఈ సారి దీని తీవ్ర ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కళ్లకల జబ్బుతో ఆసుపత్రికి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. కళ్లకల వైరస్‌కు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే లక్షణం ఉండడంతో రోజురోజుకు దీని బాధితుల సంఖ్య పెరుగుతున్నారు. పాఠశాలల్లో కళ్లకలక బారిన పడిన చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. వాతావరణంలో మార్పులు, కెమికల్ రియాక్షన్, రసాయనాలు, వాహనాల పొగ, సౌందర్య ఉత్పత్తులు వాడకం, దుమ్ము, ధూళి, పెంపుడు జంతువులు, పుప్పొడి వల్ల కళ్ల కలక వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అనంతపురంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో ఒక తరగతిలోనే దాదాపు 15 మంది విద్యార్థులు ఈ వైరస్ బారిన పడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్షాలు ఇలానే వస్తే కళ్లకలక వైరస్ బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కళ్ల కలకల బాధితులతో ఒపి పెరిగింది. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉన్న ఈ వైరస్ పల్లెకు ప్రాకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కళ్లకలక లక్షణాలు
కళ్లకలక వచ్చిన వారి కళ్లుఎరుపు రంగులోకి మారుతాయి.
దురద, నీటితో నిండిన కళ్లు ఉంటాయి.
నొప్పి, వాపు వంటి లక్షణాలు కన్పిస్తాయి.
ఈ వైరస్ బారిన పడ్డవారిలో కొందరికి జలుబు, దగ్గు, జ్వరంతో లక్షణాలు కూడా ఉంటాయి.
జాగ్రత్తలు...చికిత్సా పద్ధతులు..!
రకళ్లకలక సులువుగా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాబట్టి దీనిబారినపడ్డ వారు ఒంటరిగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
కాంటాక్ట్ లెన్సులు వాడటం మానేయాలి. బయటకు వెళ్లాల్సి వస్తే కళ్లజోడు పెట్టుకుంటే మంచిది.
నీరు తాగితూ.. హైడ్రేటెడ్‌గా ఉండాలి.
కళ్లకలక లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
అతిక మోతాదు డ్రాప్స్ వేసుకోవడం అంత మంచిది కాదు.
వైద్యుని సలహా మేరకు కంటి చుక్కలు లేదా లూబ్రికెంట్లను ఉపయోగించాలి.
కళ్లపై నీళ్లును చిమ్మిస్తూ, శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
చూసినంత మాత్రాన రాదు..!
డాక్టర్ లావణ్య,
పిహెచ్‌సి వైద్యాధికారి, చుక్కలూరు.
ఈ వ్యాధి ఉన్న వారి కళ్ల ల్లో కళ్లు పెట్టి చూసినంత మాత్రాన ఇది వ్యాపించదు. వారు వాడిన జేబురుమాళ్లు పట్టుకోవడం, తలగడలపై పడుకోవడం.. వాళ్లు కళ్లల్లో పెట్టుకున్న చేతులను మరొకరు పట్టుకుంటే వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కళ్లల్లో చేతులు పెట్టుకోకుండా ఉంటే 90 శాతం ఈ వ్యాధి బారిన పడకుండా ఉండొచ్చు. వైద్యుల సూచనల మేరకు యాంటీబయాటిక్ ఐ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం కళ్లకలక వ్యాధి చిన్నారుల్లో ఎక్కువగా ఉంది. పాఠశాలల్లో ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే అవకాశం ఉంది. నిరంతరం వారు చేతులు శుభ్రం చేసుకునేలా చూడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చేతులు కంట్లో పెట్టుకోకుండా ఉండాలని సూచించాలి. పగలు ఎక్కువసార్లు ఐడ్రాప్స్ వేసుకోవడంతో పాటు రాత్రి సమయాల్లో వేపకాయ చూట్‌గా పిలిచే డ్రాప్స్ వేసుకుంటే మంచిది. ఇంట్లో వారికి కళ్ల కలక ఉంటే వారు వినియోగించినవి మిగిలిన వారు వాడకూడదు.










