ప్రజాశక్తి - ఉండి
పెదపుల్లేరు కోపరేటివ్ సొసైటీ మాజీ ఛైర్మన్ కలిదిండి రామచంద్రరాజు (పెదపుల్లేరు రామం) మృతి గ్రామానికి, ఆయన కుటుంబానికి తీరని లోటు అని శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు, ఎంఎల్‌ఎ మంతెన రామరాజు, డిసిసిబి ఛైౖర్మన్ పివిఎల్ నరసింహరాజు తెలిపారు. శనివారం ఉదయం కలిదిండి రామచంద్రరాజు మృతి చెందారు. ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి కొయ్యే మోషేనురాజు, మంతెన రామరాజు, పివిఎల్ నరసింహరాజు నివాళులర్పించి మాట్లాడారు. కలిదిండి రామచంద్రరాజు 1967 నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఏనాడూ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకుండా తనను నమ్ముకున్న వారిని విజయపథంలో నడిపించేందుకు ఎంతో కృషి చేశారన్నారు. పెదపుల్లేరు సొసైటీ ఛైర్మన్‌గా 1980 నుంచి 85 వరకూ బాధ్యతలు నిర్వర్తించి సొసైటీని అభివృద్ధి దిశగా తీసుకెళ్లారన్నారు. మాజీ కేంద్ర మంత్రి ఉప్పలపాటి కృష్ణంరాజుతో ఉన్న సాన్నిహిత్యంతో గ్రామంలో కమ్యూనిటీ హాలు నిర్మించడంలో కీలకపాత్ర పోషించారన్నారు. కలిదిండి రామచంద్ర రాజుకు కుమారుడు శివరామకృష్ణ నారాయణ వర్మ, కుమార్తె విజయలక్ష్మి ఉన్నారు. నివాళులర్పించిన వారిలో టిటిడి బోర్డు మాజీ సభ్యులు గోకరాజు రామరాజు, మంతెన నరసింహరాజు, పాతపాటి శ్రీనివాస్ వర్మ, గ్రామ సర్పంచి కరణం పార్వతి వెంకటేశ్వరరావు, ఎంపిటిసి రాయి రావులమ్మ, రూరల్ బ్యాంక్ ఛైర్మన్ గుల్ల అప్పన్న తదితరులు ఉన్నారు.










