కలెక్టరేట్ ఎదుట పవర్‌లూమ్ కార్మికుల ధర్నా
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
పవర్‌లూమ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట సిఐటియు నేతృత్వంలో పవర్‌ల్యూమ్ కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు పెరుమాల్ మాట్లాడుతూ నగరిలో పనిచేస్తున్న పవర్‌ల్యూమ్ కార్మికుల పదేళ్లక్రితం కూలిరేట్లు పెంచారని కరోనా సాకుతో ఇచ్చే కూలిలో కూడా కోత విధించడం వల్ల కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం మొత్తం కష్టపడి పనిచేసినా రోజుకు రెండు వందలకు మించి వచ్చే పరిస్థితి లేదన్నారు. దీనికి తోడు విద్యుత్ చార్జీలు పెంచడంతో చేనేత కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. జిల్లా స్థాయి అధికారులు కల్పించుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.










