Apr 21,2023 08:23

కలెక్టర్‌కు ఉరవకొండ నియోజకవర్గం సమస్యలను విరిస్తున్న విశ్వేశ్వరరెడ్డి

           ఉరవకొండ : ఉరవకొండ నియోజకర్గంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరెడ్డి కలెక్టర్‌ ఎమ్‌.గౌతమిని కోరారు. ఈ మేరకు గురువారం నాడు కలెక్టర్‌ ఛాంబర్‌లో ఆమెను కలిసి సమస్యల పరిష్కారంపై వినతిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉరవకొండ పట్టణంలో 600 మంది ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు కేసుల కారణంగా ఆగిపోయిందన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి పేదలకు ఇళ్ల స్థలాలు అందజేయాలని కోరారు. మండలంలోని హెచ్చెల్సీ నుంచి పిఎబిఆర్‌కు వెళ్లే లింక్‌ కెనాల్‌ శిథిలావస్థకు చేరుకుందని, దీని ఆధునీకరణ పనులు చేపట్టాలన్నారు. ఉరవకొండ పట్టణంలో తాగునీటి ఎద్దడి తీర్చేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన ఉదిరిపికొండ పైపులైను పనులను ప్రారంభించాలన్నారు. పట్టణంలో ఒక అదనపు సంపు నిర్మాణం చేయాలన్నారు. వజ్రకరూరు, బెలుగుప్ప, కూడేరు మండలాల్లో అటవీ భూములు సాగు చేసుకుని జీవిస్తున్న గిరిజనులకు అటవీ హక్కుల చట్టం-2006 కింద వ్యక్తిగత హక్కులు కల్పించి, సాగు పట్టాలు వెంటనే మంజూరు చేయాలని కోరారు. రాకెట్ల-ఆమిద్యాల లిఫ్ట్‌ నిర్మాణానికి 70 ఎకరాల భూములిచ్చిన రైతులకు పెండింగ్‌లో ఉన్న రూ.8.40 కోట్ల పరిహారాన్ని విడుదల చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉరవకొండ మండలంలోని ఆమిద్యాల, కూడేరు మండలంలోని కమ్మూరు, పి.నారాయణపురం, మరుట్ల మూడవ కాలనీ గ్రామాల్లో ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను నిర్మించాలన్నారు. ఎంఎం హళ్లి గ్రామానికి పైపులైన్‌ నిర్మాణం చేపట్టాలని కోరారు. కరుట్లపల్లి గ్రామం చెరువు కట్టను భద్రం చేయించి, కట్ట వెడల్పు పెంచాలన్నారు.