సోమవారం చర్చలు జరపాలని ఆర్డీవోకు ఆదేశం
ప్రజాశక్తి - నగరి
మరమగ్గ కార్మికుల కూలి పంచాయితి మళ్లీ కలెక్టర్ చెంతకు చేరింది. చర్చల్లో భాగంగా మాస్టర్ వీవర్లు కేవలం రెండు రూపాయలు మాత్రమే పెంచుతామని చెప్పారు. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా కనీసం మూడు రూపాయలైనా ఇవ్వాలని మరమగ్గం కార్మికులు పట్టుబట్టారు. దీంతో మరమగ్గ కార్మికుల నిరసన దీక్ష తిరిగి కొనసాగుతుందని సిఐటియు నియోజకవర్గ ఇన్‌ఛార్జి వెంకటేష్ స్పష్టం చేశారు.
నగరి ప్రాంత మరమగ్గం కార్మికులు తమ కూలి రేట్లను పెంచాలని ఈనెల 5వ తేదీ నుంచి సిఐటియు ఆధ్వర్యంలో ఏకాంబరకుప్పం రైల్వేస్టేషన్ సమీపాన శివిరం ఏర్పాటు చేసుకుని భిక్షాటన, అర్ధనగ ప్రదర్శన, వంటావార్పు రూపాలలో ఎనిమిది రోజులుగా సమ్మె నిర్వహించారు. వీరి సమ్మెకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ఈనెల 8న 'బాదుడే బాదుడు' కార్యక్రమం నిమిత్తం నగరికి విచ్చేసిన ప్రతిపక్షనేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరమగ్గం కార్మికుల సమ్మె శిబిరం వద్దకు చేరుకుని కాన్వారుని ఆపి కార్మికుల న్యాయమైన పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక పక్కనున్న తమిళనాడు తరహాలో 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించడంతో పాటు, 50 ఏళ్లకే మరమగ్గ కార్మికులకు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 10న కలెక్టర్ హరినారాయణన్‌ను సిఐటియు నాయకులు కలిసి మాట్లాడగా కూలిరేట్ల పెంపు విషయానికి చొరవ తీసుకోవాలని రెవెన్యూ, లేబర్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో లేబర్ అధికారులు విధుల్లోకి వస్తే తరువాత చూస్తామని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. అధికారుల నుంచి, మాస్టర్ వీవర్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో 13వ తేదీ రెండువేల మంది మరమగ్గం కార్మికులు, వారి కుటుంబాలతో సహా తిరుపతి - చెన్నరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. దాదాపు మూడు గంటల సేపు బైఠాయించడంతో ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఆగమేఘాల మీద సంఘటనా స్థలానికి నగరి ఆర్డీవో, సిఐ, తహశీల్దార్ చేరుకుని మాస్టర్ వీవర్లతో చర్చలకు సమయం కావాలని కోరారు. అధికారుల అభ్యర్థన మేరకు ధర్నాను కార్మికులు విరమించారు. 14న స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో మాస్టర్ వీవర్లతో, మరమగ్గం కార్మికులతో నగరి మున్సిపల్ ఛైర్మన్, ఆర్డీవో, ఎసిఎల్, లేబర్ అధికారులు, సిఐ సమక్షంలో చర్చలు జరిపారు. అయితే చర్చల్లో మాస్టర్ వీవర్లు తాము రెండు రూపాయలు మాత్రమే పెంచుతామని అధికారులకు మాటిచ్చి చర్చల నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. పెరిగిన నిత్యావసర సరుకుల రేట్లు నేపథ్యంలో ఇంకో రూపాయిగా మొత్తం మూడు రూపాయలు ఇవ్వాలని కార్మికులు అధికారులకు తెలియజేసి చర్చల నుంచి వెనుదిరిగారు. చర్చలు కొలిక్కి రాకపోవడంతో మళ్లీ శుక్రవారం నుంచి సమ్మెబాట పట్టారు. ఈ నేపథ్యంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంగరాజు, చైతన్య, నాయకులు వెంకటేష్, పెరుమాళ్, గణపతి, షణ్ముగం తదితరులు కలెక్టర్‌ను కలిసి చర్చలు కొలిక్కి రాలేదని, కలెక్టర్ చొరవ తీసుకోవాలని కోరారు. దీంతో కలెక్టర్ మరోమారు స్పందిస్తూ చరవాణి ద్వారా ఆర్డీవోకు సోమవారం మాస్టర్ వీవర్లను పిలిపించి చర్చలు జరిపి కూలిరేట్లు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.










