Oct 04,2023 21:57

రికార్డులను పరిశీలిస్తున్న నాక్‌ బృందం

ప్రజాశక్తి - టెక్కలి : టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నాక్‌ గుర్తింపునకు కర్నాటక రాష్ట్రం హాసన్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ టి.సి తార్నాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రం సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ నాగేంద్ర అంబేద్కర్‌ సోల్‌, తమిళనాడు కావేరి ఉమెన్స్‌ కళాశాల ప్రొఫెసర్‌ వి.సుజాతతో కూడిన బృందం బుధవారం కళాశాలను పరిశీలించింది. కళాశాల వాతావరణం, మైదానం, భవనాల నిర్మాణం, అధ్యాపకుల వివరాలు, మౌలిక సదుపాయాలు, గ్రంథాలయం, రీడింగ్‌ రూం, తరగతి గదులు తదితర వాటిని పరిశీలించింది. టెక్కలిలో డిగ్రీ కళాశాలతో పాటు పిజి కళాశాల ఏర్పాటు, ఉన్నత కోర్సులు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే వంటి కోర్సులను ప్రవేశానికి సంబంధించి కళాశాల ప్రిన్సిపాల్‌ టి.గోవిందమ్మ ప్రతిపాదన చేశారు. ఒడిశా రాష్ట్రానికి సమీపంలో టెక్కలి ఉన్న కారణంగా చదువు ఆవశ్యకత, విద్యార్థులకు అందుబాటులో కళాశాల ఉండడం వంటి అంశాలను ప్రస్తావించారు. కళాశాలలో సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు తదితర వాటిపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం కళాశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ నాక్‌ బృందం పర్యటనలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ తెంబురు గోవిందమ్మతో పాటు వైస్‌ ప్రిన్సిపాల్‌ బి.సతీష్‌ కుమార్‌, కోఆర్డినేటర్‌ ఎ.రామారావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.