Aug 07,2023 22:01

చంద్రబాబు నాయుడు

క్లాస్‌ పీకాక కదలిక..!
          అనంతపురం ప్రతినిధి :
టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల పరిశీలన సమయంలో జిల్లా ముఖ్య నేతలకు క్లాస్‌ పీకినట్టు సమాచారం. తమ హయాంలో చేపట్టిన పనులు కళ్లకు కనబడుతున్నా.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంలో విఫలమవుతున్నారని అంక్షితలు పెట్టారు. ప్రాజెక్టుల యాత్ర ముగిసిన తరువాత చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించే సమయంలో జిల్లా ముఖ్య నేతలందరితోనూ సమావశం అయ్యారు. ఈ సమయంలో అందరికీ క్లాస్‌ పీకినట్టు సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నా క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం లేదని సుతిమెత్తగానే మందలించారు. దీంతో నేతలు ఒక్కసారిగా మేలుకుని ప్రాజెక్టుల చుట్టూ పరుగులు పడుతున్నారు. ఆదివారం రోజు ఉన్న ఫలంగా ముదిగుబ్బకు చేరుకుని జిల్లేడుబండ ప్రాజెక్టు సమస్యపై స్పందించారు. నిర్వాసితులకు పరిహారమివ్వకుండానే ప్రాజెక్టులు చేపట్టారని ఆందోళన బాటపట్టారు. వాస్తవానికి ఇదే నియోజకవర్గంలోని తాడిమర్రి మండలం పరిధిలో చిత్రావతి ముంపు నిర్వాసితుల పరిహారం విషయంలో అప్పట్లో పెద్దఎత్తున మరిమేకలపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికీ ఇంకా అనేక మందికి పరహారం అందాల్సి ఉంది కాని ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదు. ఈ ఆందోళనకు అప్పట్లో సిపిఎం మద్దతు ప్రకటించింది. కాని తెలుగుదేశం పార్టీ ప్రేక్షకపాత్రనే పోషించింది. ఇప్పటికీ ఆ సమస్యను పట్టించుకున్న దాఖలాల్లేవు. అయితే ఇప్పుడు అధినాయకుడి మందలింపుతో జిల్లేడుబండ ప్రాజెక్టుపై స్పందించారు. సోమవారం నాడు మడకశిర ప్రాజెక్టు పరిశీలించేందుకు వెళ్లారు. ఇలా వరుసగా కార్యక్రమాలు పెట్టుకోవడం నాలుగేళ్లలో ఇదే ప్రథమం కావడం గమనార్హం.
ఇదే పోరాటం కొనసాగేనా..!

వైసిపి నాలుగేళ్ల పాలనలో జిల్లాలోని ప్రధానమైన ప్రాజెక్టులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. హంద్రీనీవా ప్రవాహ సామర్థ్యం ఆరు వేల క్యూసెక్కులకు పెంచుతామని ప్రకటించి చేపట్టలేదు. కేవలం టెండర్లకే పరిమితమైంది. బిటిపి ఎత్తిపోతలకు ఇటీవలనే పరిహారం వరకు వచ్చింది. పనులు ముందుక సాగలేదు. ఇక పేరూరు ఎత్తిపోతలకు పరిహారం కూడా ఇవ్వలేదు. రూ.50 కోట్ల నిధులు అవసరం అవుతాయి. అవి విడుదల అవలేదు.. పనులూ ముందుకు సాగలేదు. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ నిర్వహణ అధ్వాన్నంగా మారింది. మూడేళ్లు తుంగభద్ర డ్యామ్‌లో పుష్కలంగా నీరున్నా పూర్తి స్థాయిలో నీరు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆధునీకరణ పనులను రద్దు చేశారు. ఇవే కాకుండా గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌, మిడ్‌పెన్నార్‌ దక్షిణ కాలువ ఆధునీకరణ పనులు టిడిపి హయాంలో చేపట్టినవికూడా రద్దు చేసే పరిస్థితి నెలకొంది. వీటిపై ఆ పార్టీ నాయకులు ఇప్పటి వరకు స్పందించిన దాఖలాల్లేవు. ఇప్పుడు అధినాయకుడి పర్యటన, మందలింపు తరువాతనైనా ఆ పార్టీ నేతలు ఈ ప్రధానమైన సమస్యలపై స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.