'క్లాప్'పై అవగాహన కల్పించండి: కమిషనర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ (క్లాప్) కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ చెప్పారు. నగరపాలక సంస్థ పరిధిలో క్లాప్ కార్యక్రమం అమలవుతున్న వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులతో సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. నగరాలను చెత్తరహితంగా తీర్చిదిద్దడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం క్లాప్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విషయాన్ని క్షేత్రస్థాయిలో గహస్థులకు, వ్యాపారస్తులకు, దుకాణదారులకు వివరించాలన్నారు. ప్రత్యేకించిన ఆటోల ద్వారా ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమాన్ని వివరించాలని, యూజర్ చార్జీలు చెల్లించడం ద్వారా కలిగే లాభాలను వివరించి, అవగాహన కల్పించాలన్నారు. వారాంతానికి నిర్దేశించిన లక్ష్యం మేరకు క్లాప్ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎంహెచ్వో అనిల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి
జగనన్న హౌసింగ్ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కమిషనర్ డాక్టర్ జె.అరుణ హౌసింగ్ అధికారులు, వార్డు అమినిటీ కార్యదర్శులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం లక్ష్యాలు సాధించడంలో వెనకబడ్డ కార్యదర్శులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఇంకా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా ఇళ్లనిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏఈ శ్రీధర్, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.










